ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం : తాళ్లూరి జయశేఖర్
తాళ్లూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తానా ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ తాళ్లూరి జయశేఖర్ అన్నారు. పుట్టి పెరిగిన ప్రాంతాల రుణాన్ని కొంతైనా తీర్చుకునేందుకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సారపాకలోని ఎంఎస్ఆర్ పబ్లిక్స్కూల్, మోరంపల్లిబంజర న్యూస్కాలర్ హైస్కూల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఫీజులు, చతరత్రా ఖర్చులకు తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా సారపాక ఎంఎస్ఆర్ స్కూల్లో జరిగిన సభలో జయశేఖర్ మాట్లాడుతూ తాళ్లూరి ట్రస్ట్, తానా సంయుక్త ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో విద్య, వైద్యం, మౌలికవసతుల కల్పనకు మరింత చేయూతనందిస్తామన్నారు. సారపాక ప్రాంతంలో జూనియర్ కళాశాలను కట్టించేందుకు కృషి చేస్తామన్నారు. సేవాభావంతోనే అధిక తృప్తి లభిస్తుందని ప్రవాస భారతీయుడు, తాళ్లూరి ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ తాళ్లూరి రాజా శ్రీకృష్ణ అన్నారు. గత 11 సంవత్సరాలుగా తమ ట్రస్టు ఆధ్వర్యంలో పేద పిల్లల చదువుకు తోడ్పాటు అందిస్తున్నామని తాళ్లూరి ట్రస్టు అధ్యక్షుడు తాళ్లూరి పంచాక్షరయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ పాఠశాల యాజమాన్యానికి రూ.1.50 లక్షల చెక్కును, న్యూస్కాలర్ స్కూల్ యాజమాన్యానికి రూ.1.50 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లూరి పంచాక్షరయ్య, ట్రస్ట్ డైరెక్టర్లు ఎన్ఆర్ఐలు తాళ్లూరి రాజాశ్రీకృష్ణ, గాయత్రి, సర్పంచ్ ధరవాత్ చందునాయక్, ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ, ఎంపీడీఓ సిలార్సాహెబ్, ఉపసర్పంచ్ బిక్కసాని శ్రీనివాస్, విష్ణు, ప్రకాశరావు, అల్లం నాగేశ్వరరావు, వీధుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.













