తాల్ సంక్రాంతి సంబరాలు 2024
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో జనవరి 20, 2024 శనివారం నాడు ఈస్ట్ లండన్ లో సంక్రాంతి శోభతో ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్ మరియు పరిసర ప్రాంతాల నుండి 300 మందికి పైగా ఈ వేడుకలకు హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో సంప్రదాయ, ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ సంక్రాంతి పండుగ స్ఫూర్తితో ముంచెత్తాయి. బొమ్మల కొలువు, భోగి పళ్లు, ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, గాలిపటాల తయారీ పోటీలు మొదలైన వివిధ కార్యక్రమాలలో పలువురు ఆసక్తిగా పాల్గొన్నారు.
రెడ్బ్రిడ్జ్ కౌన్సిల్ మేయర్ Cllr జ్యోత్స్నా ఇస్లాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. TAL నిర్వహిస్తున్న ముఖ్యమైన సేవా కార్యక్రమాలను ఆమె ప్రశంసించారు, సాంస్కృతిక వైవిధ్యాల పట్ల TAL సంస్థకు యొక్క అంకిత భావాన్ని కొనియాడారు.
TAL సంస్థ చేపట్టే ప్రతి కార్యక్రమానికి మద్దతు మరియు సహకారం అందించిన తల్లిదండ్రులు, సభ్యులకు, స్పూర్తి భావంతో పనిచేసే కార్యకర్తలకు TAL ఛైర్మన్ శ్రీ రవి సబ్బా తన కృతజ్ఞతలు తెలిపారు. TAL కల్చరల్ సెంటర్ (TCC) అందిస్తున్న విభిన్న శిక్షణ తరగతుల గురించి ట్రస్టీ శ్రీ అశోక్ మాడిశెట్టి అందరికీ వివరించాడు. సాంప్రదాయ నృత్యం మరియు సంగీతం నుండి భాషా బోధన వరకు, ఈ తరగతులు అన్ని వయస్సుల వ్యక్తులకు వారి తెలుగు వారసత్వంతో దగ్గర అవ్వడానికి ఒక శక్తివంతమైన వేదికను అందిస్తాయని అభిప్రాయపడ్డారు.
అంకితభావంతో పనిచేస్తున్న సబ్ కమిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కల్చరల్ ట్రస్టీ శ్రీ శ్రీదేవి ఆలెద్దుల. వాజిద్ బాషా, మురళీ కోట మరియు అనేకమంది ఇతర వాలంటీర్లకు, వారి అచంచలమైన నిబద్ధత మరియు కృషికి ధన్యవాదాలు తెలియజేసారు. మంత్రముగ్ధులను చేసే బొమ్మల కొలువు అలంకరణల నుండి అలరించే రంగోలి పోటీ వరకు వేడుకలోని ప్రతి అంశం అద్భుతమైన విజయాన్ని సాధించిందని తెలిపారు. TAL ట్రస్టీలు అనిల్ అనంతుల, రవి కుమార్ రెడ్డి మోచెర్ల, వెంకట్ నీల, అశోక్ మాడిశెట్టి మరియు IT- ఇన్చార్జి రాయ్ బొప్పన కూడా తమ అమూల్యమైన సహాయాన్ని అందించి, ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చూసారు.
సాంప్రదాయ ప్రదర్శనలు, ఆకర్షణీయమైన పాటలు, నృత్య ప్రదర్శనలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల రాష్టాల విభిన్న రుచులను ప్రతిబింబిస్తూ నోరూరించే వంటకాలతో కార్యక్రమం జరగడం విశేషం. ఈ కార్యక్రమ సంధానకర్త ఆర్ జె రత్న ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించారు. ఆమె చూపిన ఉత్సాహం మరియు నిష్కళంకమైన నిర్వాహణా నైపుణ్యాన్ని హాజరైన సభ్యులు ప్రశంసలతో ముంచారు. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇలానే సాగాలని పలువురు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.







