జాక్సన్విల్ లో తాజా బతుకమ్మ వేడుకల సందడి
జాక్సన్విల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (తాజా) ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ సంబరాలను ఇటీవల వైభవంగా నిర్వహించింది. తాజా అధ్యక్షుడు పాపారావు గుమ్మడపు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కోవిడ్ సంక్షోభం దృష్ట్యా సభ్యులంతా వర్చువల్గా, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎక్కడెక్కడ నుంచో రకరకాల పువ్వులను తెప్పించి బతుకమ్మలను తయారు చేసి రంగవల్లుల మధ్య కోలాహలంగా జరిపారు. ప్రముఖ జానపదగాయకుడు, సూపర్ సింగర్ ఫేమ్ రవి కుమార్ మంద గానం, జానపద కళా ప్రవీణ డా. లింగ శ్రీనివాస్ జానపద పాటలతో తాజా బతుకమ్మ వేడుకలు అంబరమంటేలా సాగాయి. ఎంతో వినూత్నంగా, కనీవినీ ఎరుగని రీతిలో ఇరుగుపొరుగు ఇళ్ళవాళ్ళంతా కలిసి పదిహేనుకు మించకుండా బతుకమ్మని ఉంచి తాజా టీవీ లైవ్లో వచ్చిన పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ వేడుకను చేసుకున్నారు. గ్రూపులు లేకుండా వ్యక్తిగతంగా కొంతమంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అందంగా ఉన్న బతుకమ్మలకు బహుమతులను కూడా ఇచ్చారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా ఎంతో ధైర్యంగా తాజా అధ్యక్షుడు పాపారావు గుమ్మడపు, వారి సభ్యులు, వలంటీర్లు అంతా కలిసి బతుకమ్మ వేడుకను అందరితో కలిసి నిర్వహించారు. మన సంప్రదాయాలను, సంస్క•తిని విడవకూడదన్న ఉద్దేశ్యంతో ఈ వేడుకలను చేశామని పాపారావు గుమ్మడపు అన్నారు.













