అమెరికా నుంచి భారత్ కు తహవ్వుర్ హుస్సేన్ రాణా!
2008 నాటి ముంబయి దాడుల కేసులో దోషిగా తేలి అమెరికాలో జైలుశిక్ష అనుభవిస్తున్న కెనడా జాతీయుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా(58)ను మనదేశానికి రప్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆరోపణలపై 2009లో రాణాను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. లష్కరే తొయిబా ఉగ్రసంస్థలకు సహకరించినట్లు దర్యాప్తులో తేలడంతో అతడికి జైలుశిక్ష పడింది. 2021 డిసెంబరులో విడుదల కానున్నట్లు సమాచారం. కారాగారవాసం పూర్తి కావడానికి ముందే అతణ్ని మనదేశానికి తీసుకొచ్చేందుకు అధికారవర్గాలు కృషి చేస్తున్నాయి. ఢిల్లీలోని జాతీయ డిఫెన్స్ కళాశాలతోపాటు పలు నగరాల్లో చాబాద్ హౌస్లపై దాడులకు కుట్ర పన్నిన ఆరోపణలపై రాణాను భారత్కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.













