అదరగొట్టిన టీఎజిసి ఉగాది సంబరాలు
గ్రేటర్ చికాగో తెలుగు సంఘం శ్రీ వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. ఉగాది వేడుకలతోపాటు, శ్రీరామనవమి వేడుకలను కూడా వైభవంగా జరిపారు. చికాగోలోని జైన్ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 900 మందికిపైగా తెలుగువారు కుటుంబంతో సహా హాజరయ్యారు. టీఎజిసి ప్రెసిడెంట్ రాము బిల్లకంటి అందరికీ స్వాగతం?పలికి ఉగాది శుభాకాంక్షలను అందజేశారు. మెంబర్షిప్ కమిటీ చైర్ వెంకట్ గునుగంటి మాట్లాడుతూ, బయట మంచువాతావరణం ఉన్నా 900 మంది ఈ వేడుకలకు హాజరవడం చూస్తుంటే కార్యక్రమం బ్రహ్మండంగా జరిగినట్లేనని చెప్పారు. కల్చరల్ హెడ్ ఉమ అవధూత మాట్లాడుతూ, ఈ వేడుకల్లో దాదాపు 30 కార్యక్రమాలను ప్రదర్శించామన్నారు. 300 మంది కళాకారులు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారని తెలిపారు.
టీఎజిసి కమిటీ సభ్యులు రాము బిల్లకంటి (ప్రెసిడెంట్), ప్రవీణ్ వేములపల్లి (ప్రెసిడెంట్ – ఎలక్ట్), వెంకట్ గునుగంటి (సెక్రటరీ), ఉమ అవధూత (కల్చరల్ చైర్, జాయింట్ సెక్రటరీ), రంగారెడ్డి లెంకల, శ్రీనివాస్ కండ్రు, సంపత్ సంగెం, రోహిత్ ఆకుల, అర్చన పొద్దుటూరి, మాధవి కొండం, నీలిమ చెల్కిచర్ల తదితరులు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. షుంబర్గ్లోని గోదావరి ఇండియన్ రెస్టారెంట్వారు వంటకాలను స్పాన్సర్ చేశారు. ఫుడ్ చైర్ పరమేశ్వర యరసాని వచ్చినవారందరికీ భోజనం అందేలా చూశారు.
బాలరామాయణం నాటకాన్ని 20 మంది పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు. హైటెక్ ఉగాది పండుగ పేరుతో ప్రదర్శించిన నాటిక కూడా అలరించింది. డాడ్ అండ్ సన్స్ ఫ్యాషన్ షో, మామ్ అండ్ డాటర్స్ డ్యాన్స్ కార్యక్రమం, చిరు ఫ్యామిలీ మెడ్లీ వంటి కార్యక్రమాలను ఈ వేడుకల్లో ప్రదర్శించారు. సందీప్ కుర్రపాటి, నీహారిక మలిగె, కాశ్యప్ బొద్దపాటి, అర్చన ఉప్పులంచ ఆధ్వర్యంలో మ్యూజికల్ షో జరిగింది.
చివరన ప్రెసిడెంట్ రాము బిల్లకంటి వచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.













