చికాగోలో టిఎజిసి దీపావళి
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో (ఉత్తర అమెరికాలో మొదటి తెలుగు సంఘం) నిర్వహించిన దసరా దీపావళి వేడుకలు అట్టహాసంగా వైభవంగా జరిగాయి. నేపర్‌విల్లే కమ్యూనిటీ చర్చి, ఎల్లో బాక్స్‌లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువారు తమ కుటుంబాలతో సహా హాజరై కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకలు సూపర్ హిట్టయ్యాయనడానికి నిదర్శనంగా దాదాపు 1000 మందికిపైగా హాజరవడమే నిదర్శనం. వేడుకల్లో భాగంగా 200 మంది స్థానిక కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను టిఎజిసి ఏర్పాటు చేసింది.
సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా ఏర్పాటు చేయడంలో, విజయవంతం చేయడంలో దాదాపు 8 వారాలకుపైగా ఎక్కువ శ్రమతో పనిచేసిన కల్చరల్ కమిటీ చైర్ ప్రసన్న కందుకూరి, కో-చైర్లు శిరీషా రెబ్బాప్రగడ మరియు శ్వేత చిన్నారి, డెకరేషన్ కమిటీ చైర్ నీలిమ చెయికిచర్ల. స్టార్ బీమ్, ఇతర సభ్యులను, వలంటీర్లను ఉమా అవధూతతోపాటు 2022 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అన్ని కమిటీ చైర్మన్లు అభినందించారు.
భారతదేశం నుండి వచ్చిన ట్రెండింగ్ మరియు అదరగొడుతున్న బ్యాండ్ కాప్రిషియో వారితో నిర్వహించిన లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ హైలైట్‌గా నిలిచింది. డెకరేషన్ కమిటీ చైర్ నీలిమ చెయికిచర్ల ఆధ్వర్యంలో స్టార్ బీమ్ ఈవెంట్ ప్లానర్లు వేదికను అందంగా అలంకరించారు. స్వాగత బ్యానర్లు ఆకట్టుకున్నాయి. సంఘం అధ్యక్షురాలు, శ్రీమతి ఉమా అవధూత, అతిథులందరికీ స్వాగతం పలికి, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపి, సాంస్కృతిక బృందం మరియు డైరెక్టర్ల మండలితో కలిసి గణేశ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో 200 మందికి పైగా కళాకారులు వివిధ రకాల కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
2023 సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నికైన పరమ యరసానితో పాటు కొత్త డైరెక్టర్ల బోర్డును ఈ సందర్భంగా అందరికీ పరిచయం చేశారు. 2021లో అధ్యక్షుడిగా పనిచేసే సంఘానికి ఎంతో సేవలందించిన వెంకట్‌ను ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీమతి ఉమా అవధూత మరియు బోర్డు సభ్యులు సత్కరించారు. ఈ వేడుకలకు ఉత్సాహంగా మద్దతు తెలిపినందుకు పాల్గొన్న అందరికీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు అతిథులకు అలాగే వేడుకలకు మద్దతుగా నిలిచిన స్పాన్సర్లకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. స్పాన్సర్లు అందించే సేవలను సభ్యులు ఉపయోగించుకోవాలని ఆమె అభ్యర్థించారు. ఎంసిలు ప్రవీణ్ వేములపల్లి మరియు సాహితీ వింజమూరి తమదైన శైలిలో ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అలరించడంతో కళా ప్రదర్శనలు మరింతగా ఆకట్టుకున్నాయి.
మెంబర్షిప్ కమిటీ సభ్యులు సంతోష్ కొండూరి, శ్రీధర్ అలవల, వెంకట్ గునుగంటి, శివ దేసు, పరమ యరసానితో పాటు ఇతర బృంద సభ్యులు రెండు ఈవెంట్లలో సభ్యులను చెక్-ఇన్ చేయడంలో సహకరించారు. సాంకేతిక బృందం సభ్యులైన శశి చావా, శ్రీకాంత్ బేతి సాంకేతిక సహకారాన్ని అందించి కార్యక్రమాల విజయవంతానికి తమవంతు సహకరించారు. వెండర్ బూత్‌లు ఈవెంట్లో మరో హైలైట్‌గా నిలిచాయి. హాజరైన వారంతా నగలు, చీరలు కొనుగోలు చేశారు.
స్థానిక రెస్టారెంట్ కూల్ మిర్చి ద్వారా వచ్చినవారికి రుచికరమైన విందు అందించారు. ఫుడ్ కమిటీ చైర్, శ్రీనివాస్ ఆడెపు, కో-చైర్ రమాకాంత్ జొన్నల తన టీమ్ వాలంటీర్లతో, నిర్ణీత సమయంలో జనసమూహానికి విందు అందించడంలో అద్భుతంగా పనిచేశారు. పిల్లలకు పిజ్జాలు కూడా వడ్డించారు.
‘సంగీతం ప్రపంచాన్ని మార్చగలదు ఎందుకంటే అది ప్రజలను మార్చగలదు అన్న నినాదంతో భారతదేశం నుండి వచ్చిన బ్యాండ్ కాప్రిసియో బృందంతో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. దాదాపు 3 గంటల పాటు నిరంతర నాన్‌స్టాప్ వినోదంతో సాగిన ఈ మధురమైన సంగీతానికి అందరూ ముగ్ధులయ్యారు. టీఏజీసీ అధ్యక్షురాలు ఉమా అవధూత, వారి బృందం క్యాప్రిషియో బృందానికి పుష్పగుచ్ఛం, శాలువా, మెమోంటోలను అందజేసి సత్కరించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను వ్యాప్తి చేయడానికి, సంరక్షించడానికి రాబోయే ఈవెంట్లను విజయవంతం చేయడానికి టిఎజిసి చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కోరుతూ, సంఘం నిర్వహించిన, నిర్వహిస్తున్న కార్యక్రమాలను మద్దతుగా నిలిచిన సభ్యులు, స్పాన్సర్లు, మీడియా భాగస్వాములతోపాటు ఇతర ప్రముఖులందరికీ ఉమా అవధూత ధన్యవాదాలను తెలియజేశారు.













