బోస్టన్ లో ఘనంగా టీఎజిబి ఉగాది వేడుకలు
బోస్టన్‌లో శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలను గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం (టీఎజిబి) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మందికిపైగా విదేశాంధ్రులు పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణాన్ని శ్రీమతి రూబీ బోయినపల్లి, వారి బృందం ఉగాది, శ్రీరామనవమి పండగ వాతావరణం ప్రతిబింబించేలా అలంకరించారు. బోర్డ్ ట్రస్ట్ సభ్యులు సురేందర్ మాదాది, అధ్యక్షుడు సీతారామ్ అమరవాది జ్యోతి ప్రజ్వలన చేయగా, కార్యక్రమం ప్రారంభమైంది. ఆధ్యాత్మిక పాటలు, శ్లోకాలు, భజనలు, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, సినీ డ్యాన్స్‌లతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా చేశారు.
మొదటిసారిగా టీఎజిబి డ్యాన్స్ సినీ నృత్యపోటీలను స్టేజ్ మీద ఎంతో హుషారుగా నిర్వహించారు. ప్రేక్షకులు ఆన్లైన్ ఓటింగ్‌లో విజేతలను ఎంపిక చేశారు. శ్రీమతి జ్యోతి రాఘవన్ (నృత్యాంజలి డ్యాన్స్ స్కూల్) శిష్యులు, అష్టలక్ష్మీ వర్ణానికి భరతనాట్యం?అద్భుతంగా చేసి, అష్టలక్ష్ములను ప్రేక్షకులకు కనువిందుగా చూపించారు. రాగభావాలను వారు ముఖకవళికలలో వ్యక్తపరిచారు. త్యాగరాజ వైభవం నాటకం హైలైట్‌గా నిలిచింది. శ్రీమతి పద్మజ, శ్రీనివాస్ బలభద్రపాత్రుని నేపథ్యంలో దాదాపు 80మంది కళాకారులతో, ఈ నృత్యనాటిక అందరినీ పరవశంతో అలరించింది. త్యాగరాజుగా పాత్ర పోషించిన శ్రీనివాస్ బలభద్రపాత్రుని తన నటనతో మధురగళంతో అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యదర్శి సుధ మూల్పూరు పర్యవేక్షణలో కల్చరల్ టీమ్ రెండునెలలకుపైగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయంతంగా నిర్వహించారు.
ఎమ్సీలు మనోజ్ ఇరువూరి, శ్యామల జాహ్నవి, సుధ చిత్తూరు, శ్వేత చిత్తులూరు, రితేష్ అల్లా, శ్రేయస్ చతుర్వేదుల ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు సీతారామ్ అమరవాది, పద్మజ బలభద్రపాత్రుని, రమేష్ దడిగల, రామకృష్ణ పెనుమర్తి, రమణ దుర్గరాజు, సుధ మూల్పూరు, వెంకట్ పప్పుల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెలుగు భాష ప్రాచుర్యంకోసం పిల్లలకు తరగతులు, వర్క్‌షాప్ నిర్వహించి, ఎంతో కృషి చేసిన శశిసోంపురంను, శ్రీనివాస్ బలభద్రపాత్రుని సేవలను గుర్తించి గౌరవించారు. చైర్మన్ శివ దోగిపర్తి, హరిబాబు మద్దెన, మల్లారెడ్డి వారికి మెమోంటోలను బహూకరించారు. ఈ సంవత్సరం టీఎజిబి కొత్త కానుకగా రేడియోను ఆవిష్కరించింది. ఈ రేడియో కార్యక్రమ వివరాలను జాయింట్ సెక్రటరీ రమేష్ దడిగల, ప్రెసిడెంట్ ఎలక్ట్ రామకృష్ణ పెనుమర్తి తెలిపారు. గోదావరి రెస్టారెంట్వారు అతిధులకు షడ్రసోపేతమైన విందు భోజనాన్ని అందించారు. అమెరికా, భారత జాతీయ గీతాలాపనతో కార్యక్రమాలు ముగిశాయి.













