TAGB: ఆకట్టుకున్న టిఎజిబి ఉగాది వేడుకలు
బోస్టన్ పరిసర ప్రాంతాల సంఘం (TAGB) ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు ఉగాది సంబరాలను వైభవంగా నిర్వహించారు. వర్కెస్టర్ లోని మెకానిక్ హాల్లో జరిగిన ఈ వేడుకలకు వేలాదిమంది తరలివచ్చారు. ఈ వేడుకల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను, సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ఉదయం 10:45 నుండి రాత్రి 11:15 వరకు ప్రదర్శనలు నిరాటంకంగా కొనసాగాయి. చిన్నవాళ్ల నుంచి పెద్ద వయస్సు కలిగినవాళ్ళు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో 1400 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి, పానకాలతో వచ్చినవారిని అందించారు. కార్యక్రమాన్ని టిఎజిబి అధ్యక్షుడు శ్రీనివాస్ గొంది, ఎన్నికైన అధ్యక్షురాలు సుధ మూల్పూరు, కార్యదర్శి దీప్తి కొరిపల్లి, భండారి జగదీశ్ చిన్నం, సాంస్కృతిక కార్యదర్శి సూర్య తేలప్రోలు గారులు కలిసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ వేడుకలో భక్తి గీతాలు, శ్లోకాలు, భజనలు, శాస్త్రీయ సంగీతం, భరతనాట్యం, కూచిపూడి, సినీనృత్యాలు వంటి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో చిన్నారులు, పెద్దలు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు శ్రీ ఆనంద సాయిని ఘనంగా సత్కరించారు. ‘‘పసిడి పద్యాలు’’ పోటీలో పాల్గొన్న చిన్నారులకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. ‘‘తెలుగు వాకిలి’’ అనే పేరుతో తెలుగు బోధన చేస్తున్న వివిధ సంస్థలు ఈ ఉత్సవంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మిస్ అండ్ మిసెస్ టిఎజిబి పోటీలునటుడు, మోడల్ కౌశల్ మండ ఆధ్వర్యంలో జరిగింది. అనేక మంది మహిళలు, చిన్నారులు ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మొత్తం 35 కార్యక్రమాల్లో 300 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. జబర్దస్త్ బృందం చేసిన హాస్య కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ వేడుకకు ప్రధానాకర్షణగా నిలిచిన అనూప్ రూబెన్స్ సంగీత విభావరి రెండు గంటలపాటు సాగింది. సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్, ఆయన బృందం ప్రేక్షకులను సంగీత మాయలో ముంచెత్తింది. ప్రత్యేకంగా టిఎజిబి కోసం రచించి స్వరపరచిన పాటను వారి బృందం ప్రదర్శించింది, ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఉత్సవం విజయవంతంగా నిర్వహించడానికి సాంస్కృతిక కార్యదర్శి సూర్య తేలప్రోలు గారి నేతృత్వంలోని కల్చరల్ టీమ్ రెండు నెలలుగా నిరంతరం కృషి చేసింది. చివరన ఈ వేడుకలకు సహకరించిన అందరికీ టీఎజిబి కార్యవర్గం ధన్యవాదాలను తెలియజేసింది.








