టీఏజీబీ సూపర్ సింగర్.. సంప్రదాయ సంగీత పోటీలకు ఘనంగా ఏర్పాట్లు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (టీఏజీబీ) ఆధ్వర్యంలో సూపర్ సింగర్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలు జనవరి 21న ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్నాయి. మసాచుసెట్స్‌లోని లిటిల్‌టన్‌లో ఉన్న రూబెన్ హోర్ పబ్లిక్ లైబ్రరీ ఈ పోటీలకు వేదికకానుంది. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునే వారు జనవరి 14వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వ్యక్తిగత విభాగంలో క్లాసిక్, సెమీ క్లాసిక్, ఫిలిం, ఫోక్ గీతాలను ఆలపించవచ్చు. బృందగానం (గ్రూప్) విభాగంలో క్లాసికల్, సెమీ క్లాసికల్ గీతాలు మాత్రమే ఆలపించాల్సి ఉంటుంది. క్లాసికల్ (సంప్రదాయ) సంగీతంలో గీతం, వర్ణం, లేదా కృతి, మనోధర్మం (స్వర కల్పన, రాగాలాపన, నేరావల్) ఉంటాయి. సబ్ జూనియర్ (5-8 సంవత్సరాల వయసు), జూనియర్ (9-12 సంవత్సరాల వయసు), సీనియర్ (13-17 సంవత్సరాల వయసు), అడల్ట్ (18+ సంవత్సరాల వయసు) విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సంప్రదాయ సంగీతం ఎంచుకున్న వారు తెలుగు, సంస్కృతం భాషల్లోని గీతాలను ఈ పోటీల్లో ఆలపించవచ్చు. క్లాసికల్ మినహా మిగతా విభాగాల్లో గీతాలాపన చేసేవారు కేవలం తెలుగు గీతాలనే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే క్లాసికల్ విభాగం అభ్యర్థులు అత్యధికంగా 10 నిమిషాలు, మిగతా విభాగాల అభ్యర్థులు అత్యధికంగా 5 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.