తెలుగు భాష ప్రచారం కోసం టీఏజీబీ వక్తృత్వ పోటీలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో దసరా-దీపావళి సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్టోరీ టెల్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లలు, 11-15 సంవత్సరాల పిల్లలు, 16-21 ఏళ్ల కుర్రాళ్లు.. ఇలా మూడు విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 14న ఉదయం 10 గంటలకు ‘జూమ్’ ద్వారా వర్చువల్‌గా ఈ పోటీలు జరుగుతాయి. ‘పురాణాల్లో నాకు నచ్చిన పాత్ర’, ‘నాకు నచ్చిన స్వతంత్ర సమర యోధుడు’ అనే రెండు అంశాల్లో ఏదో ఒకదానిపై అచ్చమైన తెలుగులో మూడు నిమిషాలపాటు పోటీ దారులు మాట్లాడవలసి ఉంటుంది. తెలుగు భాషను, ఆ భాష మాట్లాడటాన్ని ప్రోత్సహించేందుకే తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనాలని అనుకునే వారు https://tagb.org/event-details.php?ID=155 లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు.