అంగరంగ వైభవంగా టి.ఏ.జి.బి సంక్రాంతి సంబరాలు !!
జనవరి 27, 2024 ఉదయం Charles Whitcomb Marlboro Middle School ప్రాంగణం TAGB సంక్రాంతి సంబరాలకై ఎంచక్కా ముస్తాబై కళకళలాడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం నిరాఘాటంగా నిర్వహించిన 8 గంటల కార్యక్రమం, ఈ ఉత్సవాలకి, దాదాపు 600 మంది పైగా హాజరుకాగా, ఆహుతులని అలరించింది. రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు పిల్లల సందడులతో ప్రాంగణం కళకళ లాడింది.
TAGB తెలుగు వాకిలి తోరణం కింద నిర్వహించిన ఏక పాత్రాభినయం పోటీలతో ఈ సంబరాలకి శుభారంభం అయ్యింది. ఎంతో మంది చిన్నారులు, పెద్దలు కూడా అమిత ఉత్సాహంతో పాల్గొని ఈ పోటీలు విజయవంతం చేశారు. ఈ పోటీలలో పాల్గొన్న పిల్లలకి, వారిని ప్రోత్సహిస్తున్న గురువులకి, తల్లి తండ్రులకి మా మాతృభాషాభివందనములు.
ఆ తరువాత, వచ్చిన వారిని సాదరంగా ఆహ్వనిస్తూ, టి.ఏ.జి.బి కార్యవర్గం మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యదర్శి గాయత్రి అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, నాటికలు వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వీనులవిందుగా శాస్త్రీయ సంగీతం, కన్నుల విందుగా నృత్యం, మరెన్నోవైవిధ్యమైన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, చిన్నారులు చేసిన ఇంకెన్నో ఉత్సాహ భరితమైన, ఉత్తేజ పూరితమైన సినీ నాట్యాలు ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని ఆహుతులు మెచ్చుకున్నారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు టి.ఏ.జి.బి అధ్యక్షురాలు శ్రీమతి పద్మజ బలభద్రపాత్రుని. తెలుగు ఏక పాత్రాభినయం మరియు శాస్త్రీయ సంగీత పోటీలలో పాల్గొన్న పిల్లలకు బహుమతులు అందించారు. TAGB Elections Committee వారు రాబొయే సంవత్సర కొత్త కార్యవర్గ సభ్యులని ప్రకటించారు. 2024-25 అధ్యక్షురాలు దీప్తి గోరా, కార్యదర్శి శ్రీకాంత్ గోమఠం, కోశాధికారి దీప్తి కొరిపల్లి, సాంస్కృతిక కార్యదర్శి జగదీష్ చిన్నం, ప్రెసిడెంట్-ఎలెక్ట్ శ్రీనివాస్ గొంది లకు అభినందనలు.
శ్రీమతి ప్రఫుల్ల వేలూరి నేతృత్వంలో, శ్రీనివాస్ బలభద్రపాత్రుని గాత్రంతో రూపు దిద్దుకున్న, 45 మందికి పైగా కళాకారులు పాల్గోని ఎంతో ఉత్సాహంతో ప్రదర్శించిన, కూచిపూడి నృత్య రూపకం “నవవిధ భక్తి”, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
సంక్రాంతి సంబరాల సందర్భంగా ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం: శాస్త్రీయ కర్ణాటక/హిందుస్తానీ సంగీత విజ్ఞానం మెండుగా కల ప్రఖ్యాత యువ గాయకుడు ‘Abby V’, సహ గాయకురాలు ‘శ్రద్ధా గణేష్’ తో కలిసి చేసిన సంగీత విభావరి ప్రేక్షకులని, ముఖ్యంగా యువతని అంతో ఆకట్టుకుంది.
వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన సాంస్కృతిక శాఖ మరియు యువ టి.ఏ.జి.బి సభ్యులు కార్యక్రమంలో మెరిసి మురిపించారు.







