టీఏజీబీ సంక్రాంతి సంబరాలు 2018
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(టీఏజీబీ) ఆధ్వర్యంలో జనవరి 27న శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మసాచుయేట్స్లోని బెల్లింగ్హమ్ హైస్కూల్లో జరిగిన టీఏజీబీ సంక్రాంతి సంబరాల్లో 700 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. సంప్రదాయ అలంకరణలతో, బొమ్మల కొలువుతో సంక్రాంతి పండుగ వాతావరణాన్ని గుర్తుచేసేలా కార్యక్రమ ప్రాంగణాన్ని టీఏజీబీ సాంస్కృతిక బృదం తీర్చిదిద్దింది. ఆహుతులను అలరించేలా ఎన్నో కార్యక్రమాలను రూపొందించింది.
ముందుగా గోవిందరావు భీశెట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శ్రీనివాస్ బచ్చు స్వాగతోపన్యాసం చేశారు. చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతం, ఆధ్యాత్మిక పాటలు, శ్లోకాలు, ప్రత్యేక నృత్యాలు, శాస్త్రీయ సంగీతం.. తెలుగు ప్రవాసులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి నిఘంటువులుగా శ్రీకాంత్ గోమట్టం, విజయలక్ష్మి బల్చ, కిరణ్మయి చతుర్వేదుల, రవి మేకల, దీప్తి గోర, అమృత వరద, మహతి మోతాలి, నాగశ్రీ చక్కా వ్యవహరించారు. మొట్టమొదటిసారిగా తెలుగు వక్తృత్వ పోటీలను రాజా చిలకమర్తి, ప్రతిమ పెనుమూర్తి, మాధవి కమ్మ ఆధ్వర్యంలో జరిగాయి. బోస్టన్ పరిసర ప్రాంతాల పిల్లలంతా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాల నేపథ్యంలో వివిధ కళలను ప్రదర్శించిన వారికి, వక్తృత్వ పోటీల్లో గెలిచిన వారికి టీఏజీబీ కమిటీ ప్రత్యేకాభినందనలు తెలియజేసింది. శ్రీసాయి సీతామరాజు ఆధ్వర్యంలో యువకులతో ప్రత్యేక సంగీత బృంద లహరి కార్యక్రమం వీనుల విందు చేసింది. ఈ సంగీత బృంద లహరికి ‘శ్రావీయో ఏవీ’ బృందం ఆడియో సహకారాన్ని అందించింది. రూబీ బోయినపల్లి నేతృత్వంలోని బృందం ప్రదర్శించిన ‘అమ్మ-ఆదిశక్తి అమృతవల్లి’ సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యవర్గ సభ్యులైన మణిమాల చెలుపాది, ప్రదీప్ పెనుబోలు, సీతారామ్ అమరవాది, దీప్తి గోరా, రామకృష్ణ పెనుమర్తి, సత్య పరకాల, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ కొల్లిపర, వైస్ చైర్మన్ కాంత్ వల్లిపల్లి, బోర్డు సభ్యులందరికీ టీఏజీబీ అధ్యక్షలు శ్రీనివాస్ బచ్చు కృతజ్ఞతలు తెలిపారు. టీఏజీబీ సంస్థ గతంలో నిర్వహించిన కార్యక్రమాలకు ఆర్థిక సాయాన్ని అందించిన కోడెబోయిన కుటుంబాన్ని, ఇతర దాతలను, వాలంటీర్స్ను కార్యవర్గం సత్కరించింది. ఈ యేడాది ‘మాన్యువల్ కార్బల్లో గవర్నర్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్’ అవార్డు గ్రహీత, పూర్వ బోర్డు మెంబర్ పూర్ణారావు బోలినేనిని కార్యవర్గం సన్మానించింది.
ఈ కార్యక్రమం సందర్భంగా టీఏజీబీ ఎలక్షణ్ కమిషన్ చైర్మన్ మల్లికార్జునరావు, సభ్యులు గోవిందరావు భీశెట్టి, మల్లారెడ్డి కర్రా నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు మణిమాల చెలుపాది, తమ కార్యవర్గం, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీకాంత్ వల్లిపల్లి, బోర్డు సభ్యులను సభాముఖంగా పరిచయం చేసి అభినందించారు. ఈ సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన ప్రవాసులకు, బెల్లింగ్హమ్ హైస్కూల్, ఫైర్ అండ్ పోలీస్ యాజమాన్యానికి, భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన మినర్వా రెస్టారెంట్‌కు టీఏజీబీ కార్యవర్గం ప్రత్యేక అభినందనలు తెలిపింది.













