టాకో అక్షరమాల విజయవంతం
ముందు తరాలు కూడా ఉత్సాహంగా తెలుగు నేర్చుకోవాలనే ఉద్దేశంతో సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం కొలంబస్, ఒహాయో లో ప్రతి సంవత్సరం నిర్వహించే తెలుగు పండగ ‘అక్షరమాల’ ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగింది. టాకో అధ్యక్షులు ఫణి భూషణ్ పొట్లూరి, విద్య, సాహిత్య కమిటీ చైర్ పర్సన్ కాళీ ప్రసాద్ రాజు మావులేటి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక అత్యంత కోలాహలంగా 2 రోజులపాటు మార్చి 9, 10 తేదీల్లో భారతీయ హిందూ టెంపుల్, హయ్యత్స్ మిడిల్ స్కూల్ లో జరిగింది.
ఈ పోటీల్లో వ్రాత, కథలు, కవితలు, వక్తత్వ పోటీలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా ఏకపాత్రాభినయం, తెలుగు స్పెల్లింగ్ బీ, శాస్త్రీయ, లలిత సంగీత పోటీలను కూడా జోడించటంతో పిల్లలు, పెద్దలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల్, సాయి బాల విహార్, మనబడ, పాఠశాల తెలుగు బడులకు చెందిన విద్యార్థినీ విద్యార్థులతో పాటు వక్తత్వ, ఏక పాత్రాభినయం పోటీలలో స్థానికంగా ఉన్న తెలుగు వారంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరికీ పాఠశాల సౌజన్యంతో మెడల్స్, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. విజేతలుగా నిలిచిన వారందిరికీ మే 11 న జరిగే టాకో ఉగాది వేడుకల్లో బహుమతి ప్రదానం జరుగుతుంది.













