టాకో వారి కమ్మనైన తెలుగు భాష.. తీయనైన తెలుగు పాట
సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) వారు మార్చ్ 7, 8న, “అక్షరమాల” కార్యక్రమాన్ని ఎంతో వీనులవిందుగా జరుపుకున్నారు. “అక్షరమాల” కార్యక్రమంలో భాగంగా పిల్లలకు “పదవినోదం”, పిన్నలకు / పెద్దలకు తుదివిడత “సంగీత” పోటీలు మార్చ్ 7న, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగాయి. “సంగీత” పోటీలు శాస్త్రీయ, లలిత, జానపద విభాగాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక మంది కవుల కలం నుంచి జాలువారిన ఆణిముత్యాల్లాంటి పాటలతో, పోటీదారులు తమ చక్కటి గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.
మార్చ్ 8న పిల్లల విభాగంలో తెలుగు వ్రాత పరీక్ష మరియు మౌఖికం, కథలు చెప్పటం, పెద్దల విభాగంలో వకృత్వ ,ఏక పాత్రాభినయం, కథలు, కవితల పోటీలు ఓలంటాంజి హ్యాట్స్ మిడిల్ స్కూల్ లో జరిగాయి. వయోభేదం లేకుండా చిన్నలు, పెద్దలు, తెలుగు జాతీయ నాయకుల వేషధారణలో తమ వాక్చాతుర్యాన్ని మరియు నటనని ప్రదర్శించారు. అలాగే కవులు, కవయిత్రులు తమ రచనలతో మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పుతూ చేసిన పద ప్రయోగం ప్రశంసనీయం. వకృత్వ పోటీలో కూడా పోటీదారులు తమ వాదప్రతివాదనలతో తమ జ్ఞానాన్ని, వాక్ చాతుర్యాన్ని వినిపించారు. అలాగే తుదివిడత సంగీత పోటీ విజేతలకు , మలివిడత పోటీ పెట్టి విజేతలను ఎంపికచేశారు.
మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష. అలాంటి 56 అక్షరాల అమ్మ భాషకు, టాకో వారు ఎల్లప్పుడు పెద్దపీట వేసి నీరాజనాలు అర్పిస్తారు. ఈ అక్షరమాల పోటీలకు 150కి పైగా పిల్లలు, 50కి పైగా పెద్దలు పాల్గొని వారి తెలుగు అభిరుచిని, అభిమానాన్ని చాటారు.
“అక్షరమాల-2020 ” కార్యక్రమం టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని గారి ఆధ్వర్యంలో అక్షరమాల-2020 బృందం అనిత ఎనిగెళ్ళ, సుష్మ వద్దే, శ్రీలక్ష్మీ గడిపర్తి అధ్యక్షతన 2020 కమిటీ నీలిమ యలమంచలి, కాళీ ప్రసాద్ మావులేటి, ఉష శాఖమూరు, శివ చావా, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, సుధీర్ కనగాల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్ చందనం, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, అపర్ణ దండమూడి, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, చిరంజీవి సమ్మెట, రమ ప్రత్తిపాటి, గార్ల సహాయంతో విజయవంతంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి అనేక సంగీత ఉపాధ్యాయులు, తెలుగు భాషా సేవకులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతలందరికీ బహుమతి ప్రధానం “టాకో-ఉగాది”వేడుకల (ఏప్రిల్ 25 2020) రోజున జరుగుతుంది.
చల్లటి శీతాకాలంలో చక్కటి కార్యక్రమానికి 500 మందికి పైచిలుకు కొలంబస్ తెలుగు ప్రజలు, అభిమానులు తరలి వచ్చారు. 200 పైగా సంగీత, భాషాప్రియులు పోటీల్లో పాల్గొన్నారు.వారందరికీ టాకో ట్రస్టీలు శ్రీలత రేవూరు, జ్యోతి దండు, ఫణి భూషణ్ పొట్లూరి, కోటి బోడెపూడి, సుబ్బారెడ్డి కోవూరు, ప్రశంస పత్రాలు మరియు పతకాలు ప్రధానం చేశారు. కమ్మనైన తెలుగు భాషతో .. తీయనైన తెలుగు పాటతో “అక్షరమాల-2020” విజయవంతంగా జరిగింది.













