ట్రంప్ పై పరువునష్టం కేసు వేసిన శృంగారతార
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై శృంగారతార స్టార్మీ డానియెల్స్ తాజాగా పరువునష్టం కేసు వేశారు. ట్రంప్‌తో తనకు లైంగిక సంబంధం ఉందనీ, ఈ విషయాన్ని బయటపెట్టకుండా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆయన మనిషి తనను బెదిరించాడని కొంతకాలంగా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. 2011లో లాస్ వేగాస్ పార్కింగ్ ప్రదేశంలో తాను ఉండగా, ట్రంప్ విషయాన్ని మర్చిపోవాలనీ, లేకుంటే చంపేస్తామని ఓ వ్యక్తి బెదిరించినట్లు డానియెల్స్ చెబుతున్నారు. అయితే ఆ వ్యక్తి రేఖాచిత్రాన్ని గత మార్చి 17న ఆమె విడుదల చేయడం కలకలం రేపింది. మరుసటిరోజు ట్రంప్ స్పందిస్తూ అసలు లేని మనిషి ఊహా చిత్రాన్ని ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టడమంటే జనాన్ని వెర్రివాళ్లను చేయడమే. ఇది మీడియాకూ తెలుసు నని ట్వీట్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలనీ వాటి వల్ల తనకు తీవ్రనష్టం వాటిల్లిందని డానియెల్స్ ఆరోపిస్తున్నారు. ఇందుకు 75,000 డాలర్ల నష్టపరిహారం కోరుతూ న్యూయార్క్ సీటి కోర్టును ఆశ్రయించారు.













