అమెరికాలో ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు
కరోనా, లాక్డౌన్ల కారణంగా అమెరికాలో చిక్కుకు పోయిన వేలాది మంది విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న విదేశీ విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇలా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో భారత్‌తో పాటు పలు విదేశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఉపశమనం కలిగించినట్లయింది. ఊహించని విధంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోను చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో విశ్వవిద్యాలయాలు మూతపడిపోయి విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
అటు స్వదేశాలకు వెళ్లలేక ఇటు ఇప్పటివరకు అందుతున్న ఆర్థిక ప్రోత్సాహకాలు ఆగిపోవడం, అంతర్జాతీయ కరెన్సీ మారకపు విలువలు పడిపోవడం, ట్యూషన్ ఫీజులు, నివాస ఖర్చులు పెరిగిపోవడం లాంటి పలు కారణాలతో విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటునన విద్యార్థులు క్యాంపస్‌లోనే పని చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) ప్రకటించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుతో క్యాంపస్ పరిధిలోనే ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది. ఒక వేళ వీరి అభ్యర్థనను యూఎస్‌సిఐఎస్ అనుమతించినట్లుయితే ఒక సంవత్సరం పాటు క్యాంపస్ ప్రాంగణంలో ఉద్యోగం చేసుకునే వీలు కలుగుతుంది.













