ఆకట్టుకున్న ‘పాఠశాల’ పిల్లల రామగానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న పాఠశాల చిన్నారులు శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆన్లైన్ వేదికగా శ్రీరామగానం చేశారు. ఫిలడెల్ఫియాలోని లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటున్న చిన్నారులు కృష్ణకాంత్, శ్రియ, లలిత్, అద్వైత్, కృత్తిక, సంజన, సంజన ఎన్, పూజిత, కీర్తన, అభినవ్, వాసవి, శ్రియ తదితరులు హరికృష్ణ ఆధ్వర్యంలో శ్రీరాముని పాటలను పాడారు. శ్రీరామదాసు సినిమాలోని భద్రశైలరాజమందిర పాట ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల చైర్ నాగరాజు నలజుల మాట్లాడుతూ, తెలుగుభాషపై అందరికీ ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతో తానా పాఠశాల చిన్నారుల ద్వారా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోందని చెప్పారు.













