విద్యార్థిని శ్రీమయి పెద్దింటి అమోఘ ప్రతిభ
అదెందుకు? ఇదెందుకు? అన్నిఅచ్చులెందుకు? ఇన్ని హల్లులెందుకు?
పాఠాలెందుకు? పద్యాలెందుకు? వ్యాకరణమెందుకు? వ్యాసాలెందుకు? అలంకారా లెందుకు? అనువాదాలెందుకు? సంధులెందుకు? సమాసాలెందుకు? గణవిభజనలెందుకు? ఛందస్సులెందుకు? తెలుగెందుకు? మనబడి ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమీ చిన్నారి మనబడి విద్యార్థిని శ్రీమయి పెద్దింటి!
వర్జీనియా చాంటిలి మనబడి కేంద్రంలో ప్రభాసం పూర్తి చేసుకుని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పరీక్షలలో అత్యధిక మార్కులు, 32 క్రెడిట్స్ సంపాదించుకోవడంతో పాటు గురువు మరియు తల్లిదండ్రుల ప్రోత్సాహాలతో భాషావ్యాకరణ అంశాల్ని ఆకళింపు చేసుకుని తనదైన బాణీలో తేటగీతిలో ఒక శబ్దార్థ శతకాన్ని రచించి తెలుగు భాష నేర్చుకునే చిన్నారులకు ఆదర్శప్రాయంగా నిలిచింది! నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవడమే కాక మనబడి చరిత్రలో ఒక సువర్ణాధ్యయాన్ని తన స్వహస్తాలతో లిఖించుకుంది!
కొద్ది రోజుల క్రితం తన శతకాన్ని ప్రచురించి గ్రేటర్ వాషింగ్టన్ ఏరియా పరిధిలో క్యాట్స్ సంస్థ వేదికగా పుస్తకావిష్కరణ జరిగినప్పటికీ, ఇటీవల తానా కన్వెన్షన్ లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శ్రీ వడ్డేపల్లి కష్ణ లాంటి మహామహుల ఆశీర్వచనాలతో మరోమారు ఈ పుస్తక ఆవిష్కరణ, పరిచయ కార్యక్రమం జరిగింది!













