Sreekanth Akkapalli: ఎఫ్.ఐ.ఏ. 2026 నూతన కార్యవర్గం ఖరారు.. అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవ ఎన్నిక
న్యూయార్క్: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూ.ఎస్.ఏ (FIA NYNJ-CT-NE) తన 2026 కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమించిన 2026 ఎన్నికల కమిషన్ (అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయ్‌తో కూడినది) నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ అనంతరం, కమిషన్ సిఫార్సులకు బోర్డు ఆమోదం తెలిపింది. నూతనంగా ఖరారు అయిన 2026 కార్యనిర్వాహక బృందం జనవరి 1, 2026 నుండి బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ బృందానికి అధ్యక్షుడిగా (President) శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అవుట్గోయింగ్ ప్రెసిడెంట్ సౌరిన్ పారిఖ్ స్థానాన్ని భర్తీ చేస్తారు. గత బృందం నుండి వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి పటేల్, జనరల్ సెక్రటరీగా సృష్టి కౌల్ నరులా తమ పాత్రల్లో కొనసాగుతారు. ఈ సంవత్సరం పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ఎన్నికల కమిషన్, ఎఫ్ఐఏ బోర్డు కలిసి కార్యనిర్వాహక బృందాన్ని క్రమబద్ధీకరించాలని, కౌన్సిల్‌ను విస్తరించాలని నిర్ణయించాయి. స్వతంత్ర CPA సంస్థ అయిన షా అకౌంటెంట్స్ సంస్థకు కోశాధికారిగా (Treasurer) వ్యవహరించనుంది.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి ఒక విశిష్టమైన వ్యాపారవేత్త. ఆయన వ్యాపారాలు అమెరికా, భారత్ రెండు దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఆయన పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి, టెక్నాలజీ, మీడియా, డయాస్పోరా ఎంగేజ్మెంట్ (ప్రవాస భారతీయ భాగస్వామ్యం) వంటి రంగాలను కలిగి ఉంది. బహుళజాతి సాఫ్ట్వేర్ అభివృద్ధి, ట్రాన్సిట్ టెక్నాలజీ కన్సల్టింగ్, లైఫ్ సైన్సెస్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్రీడా సామగ్రి తయారీ, ప్రీమియం ఫర్నిచర్ డిజైన్ వంటి విభిన్న రంగాల్లో ఉన్నాయి. ఇది ఆయనకున్న వ్యూహాత్మక దృష్టి, బలమైన కార్యాచరణ నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది.
అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత..
అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా శ్రీకాంత్ అక్కపల్లి… బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. వారి విశ్వాసం పొందడాన్ని “ఆనందంగా, అదృష్టంగా” భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, చైర్మన్ అంకుర్ వైద్యకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బోర్డు, ట్రస్టీలు, సలహా సభ్యులు, కార్యనిర్వాహక సహచరులందరి స్వాగతానికి ఆయన తన ధన్యవాదాలు తెలిపారు.
చారిత్రక ప్రాధాన్యత, నిబద్ధత…
ఈ సందర్భంగా రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ.. స్వరాష్ట్రం నుంచి ఈ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి తానే కావడం గర్వకారణమని అన్నారు. మంచి ఉద్దేశంతో, నిజాయతీగా పని చేస్తానని ప్రమాణం చేశారు. సంస్థను బాగా అభివృద్ధి చేస్తానని, ఎఫ్.ఐ.ఏ. ఇప్పటికే చేస్తున్న ముఖ్యమైన పనులను మరింత బలోపేతం చేస్తామన్నారు. అందరినీ కలుపుకొని పోతూ కొత్త పనులు మొదలుపెడతానని బోర్డుకు, ఎఫ్.ఐ.ఏ.లో ఉన్న అందరికీ హామీ ఇచ్చారు.
తెలుగు టైమ్స్‌తో చిరకాల అనుబంధం..
శ్రీకాంత్ అక్కపల్లి కేవలం వ్యాపార, సామాజిక రంగాల్లోనే కాకుండా, మీడియా రంగంలోనూ గుర్తింపు పొందారు. నూతన అధ్యక్షుడైన అక్కపల్లికి ముఖ్యంగా ‘తెలుగు టైమ్స్’ పత్రికతో చిరకాల అనుబంధం ఉంది. శ్రీ శ్రీకాంత్ అక్కపల్లి అమెరికాలో టీవీ9 తెలుగు , గుజరాతీ విభాగాలను నిర్వహిస్తున్నారు. 2023 నుంచి తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ నిర్వహణ లో టీవీ9 మీడియా పార్టనర్ గా ఉండటంలో ఆయన సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా తెలుగు టైమ్స్ శ్రీ శ్రీకాంత్ అక్కపల్లి కి అభినందనలు తెలుపుతోంది. న్యూ యార్క్ లో దాదాపు 55 సంవత్సరాల FIA సంస్థ కి ఒక తెలుగు వ్యక్తి మొదటి సారిగా ప్రెసిడెంట్ అవడం తెలుగు వారికి గర్వకారణం అని తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి తెలిపారు.






