UK మరియు యూరప్ దేశాలలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన తితిదే శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో UK లోని అక్టోబర్ 10వ తేదీన బెల్ ఫాస్ట్, 12 న బేసింగ్ స్టోక్, 14న మిల్టన్ కీన్స్ మరియు 15 వ తేదీన గ్లూస్టర్ నగరాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణోత్సవం జరిగేలా చూసుకుంది. అక్కడి నిర్వాహకులు… భక్తులు, అర్చకులు, వేదపండితులకు, తితిదే అధికారులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఆయా నగరాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొని ప్రత్యక్షంగా స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. బెల్ ఫాస్ట్ – నార్త్ ఐర్లాండ్ లో శ్రీ జి. రమేష్, శ్రీ సతీష్, బేసింగ్ స్టోక్ – లండన్ లో శ్రీ ఎమ్. అరుణ్, శ్రీమతి శ్రీని, మిల్టన్ కీన్స్ లో ఎమ్. లోకనాధ, శ్రీ సి. జనార్ధన్, గ్లూస్టర్ లో శ్రీ శివరామ జి. శ్రీ ఇ. నరసింహ, ఎ. శివ మరియు వారితో కలిసి ఉన్న తెలుగు సంఘాలు, ధార్మిక, సేవా సంస్థల సభ్యులు తదితరులు స్వామివారి కల్యాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసారు.
ఈ నేపథ్యంలో UK మరియు యూరప్ దేశాలలోని వివిధ నగరాలలో ఘనంగా జరిగిన శ్రీ మలయప్ప స్వామి వారి కల్యాణోత్సవాలపై ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి పత్రికా ప్రకటన విడుదల చేసారు.
UK మరియు యూరప్ దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30వ తేదీ నుండి నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తొమ్మిది (09) నగరాలలో శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. వైఖానస ఆగమం ప్రకారం తితిదే నుండి వెళ్ళిన అర్చకులు, వేదపండితులు ఈ కల్యాణోత్సవాలను నిర్వహించారు. అన్ని నగరాలలో శ్రీ మలయప్ప స్వామివారి కల్యాణోత్సవానికి అశేష సంఖ్యలో ఎన్నారై భక్తులు ప్రత్యక్షంగా హాజరయ్యి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి, భక్తి పరవశంలో పులకించారు. ఈ కల్యాణోత్సవాలకు ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సమన్వయ సహకారం అందించింది.
ప్రతి ఏటా ప్రపంచంలోని వివిధ దేశాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం నిర్వహించాలని భక్తులు, తెలుగు మరియు భారతీయ సంస్థలు ముందుకువస్తే, ఆయా దేశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారని శ్రీ వెంకట్ అన్నారు.
గత 16 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో తిరుమల శ్రీవారి కల్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కల్యాణోత్సవాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా ఎన్నారై భక్తులు పాల్గొన్నారు. తెలుగు, భారతీయ భక్తులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న వారుకూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణ ఘట్టాన్ని వీక్షించి ఆశీర్వాదాలు అందుకున్నారన్నారు.
ఆయా నగరాలలోని నిర్వాహకులు తితిదే చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి, ఈవో శ్రీ ధర్మారెడ్డి గారికి కృతఙ్ఞతలు తెలిపారు.
స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమాన్ని తితిదే నుండి Dy. EE శ్రీ వి.జె. నాగరాజ, SVBC డైరెక్టర్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి సమయానుసారం సమన్వయము చేశారు. SVBC ఛానెల్ ఈ కల్యాణోత్సవాలను ప్రత్యక్షప్రసారం చేసింది.













