‘బ్లెస్సింగ్ అకౌంట్’ ప్రారంభించిన శ్రీరావు బొడ్డపు, ఉషా
ఎసొల్విట్ గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకులు, ఛైర్మన్ శ్రీరావు బొడ్డపు 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా లాభాపేక్షలేని ‘బ్లెస్సింగ్ అకౌంట్’ని ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండికి చెందిన ఆయన అమెరికాలోని ఆస్టిన్‌లో స్థిరపడి.. గత రెండున్నర దశాబ్దాలుగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ సేవలకు గాను శ్రీ రావు బొడ్డపు, ఉషా బొడ్డపు దంపతులిద్దరూ పలు సంస్థల నుంచి అవార్డులు కూడా వరించాయి. తాజాగా ఆస్టిన్‌లో బ్లెస్సింగ్ అకౌంట్‌ను ప్రారంభించినందుకు శ్రీ రావు దంపతుల్ని టెక్సాస్‌కు చెందిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లాయడ్ డొగ్గెట్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ రావు మాట్లాడుతూ.. తనకు 50 ఏళ్లు నిండాయని సెలబ్రేట్ చేసుకోవడం తన ఉద్దేశం కాదన్నారు. ఇప్పటివరకు తన భార్యతో కలిసి అనేక మంది వృద్ధుల్ని దత్తత తీసుకొని చాలా మందికి ఉద్యోగాలు కల్పించామనీ.. దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు. దీన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వేదికను ఏర్పాటు చేసి సేవా భావంతో పనిచేస్తున్న అందరినీ కనెక్ట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ ద్వారా తమ సేవాభావాన్ని చాటేందుకు బ్లెస్సింగ్ ఖాతా తీసుకొని ఉంటే.. దీని వల్ల ఎంతమందికి సహాయం చేశారు? ఎవరికి చేశారు తదితర వివరాలన్నీ తెలియడం ద్వారా ఈ ఛారిటీ కార్యక్రమాల్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. 25 ఏళ్లుగా భారత్‌లో అనేక ఉద్యోగాలు కల్పించినట్టు ఆయన సతీమణి ఉషా బొడ్డపు తెలిపారు. భారత్‌లో వృద్ధులకు ఔషధాలు పంపిణీ చేస్తున్నామనీ.. ఇంటి పెద్ద దిక్కులేని కుటుంబాల పిల్లలకు ల్యాప్‌టాప్‌లను ఇవ్వడంతోపాటు వారికి శిక్షణ కల్పించి ఉద్యోగావకాశాలు కల్పించినట్టు వెల్లడిరచారు. తాడేపల్లిగూడెంలోని ఉన్నత పాఠశాలలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆమె వివరించారు. దీన్ని మరింతగా కొనసాగించాలనే సంకల్పంతోనే బ్లెస్సింగ్ అకౌంట్ తీసుకున్నట్టు చెప్పారు.













