Sreeja: మెంఫిస్ మెరుపు తీగ- డల్లాస్ డైమండ్
“ఖండాంతరాల్లో పుట్టి పెరుగుతున్న మన చిన్నారులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం, భాషా సాహిత్యాలను, సంగీత నృత్యాలను నేర్చుకోవడం, నిష్ణాతులవడం ముదావహం” అంటారు శ్రీజ తాతగారు త్రినాధ్ రాపేటి. “మా శ్రీజ మెంఫిస్ మెరుపుతీగ, డల్లాస్ డైమండ్” అంటూ మనుమరాలు నృత్యాభినవేశాన్ని అభినందించారు అమ్మమ్మ శ్రీమతి రూపవతి రాపేటి.
దాదాపు రెండువందలు పైచిలుకు కళాభిమానులు, నాయనమ్మ వెంటక లక్ష్మి తాతయ్య సత్యారావు సూరిసెట్టిల సమక్షంలో శ్రీజ (Sreeja) కూచిపూడి నృత్య రంగప్రవేశం టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని ఫ్రిస్కో పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. గురు శ్రీమతి పద్మ సొంటి నట్టువంగం, మాధవి శరత్ అట్లూరి గాత్రం, దీపా శాస్త్రి వయోలిన్, గౌతమ్ నరసింహప్రసాద్ ఫ్లూట్, రఘునందన్ నలంచక్రవర్తుల మృదంగంతో సహకరించగా, కుమారి రితిక మరియూ అదితి ప్రతి అంశాన్ని చక్కగా వివరించారు.
జులై 5 ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్‌లో భజ మానస కీర్తనతో ప్రారంభించి, శ్రీ కృష్ణ జనన శబ్దం, బాలగోపాల తరంగం, భో శంభో, కేశవ నారాయణ, తందనాన, థిల్లాన అంశాలతో మూడుగంటలపాటు ముగ్ధమనోహరంగా సాగిన నృత్య ప్రదర్శన మంగళ గీతంతో ముగిసింది. శ్రీజ 2023లో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కూచిపూడిలో డిప్లొమా, ఒకినోవా కరాటేలో బ్లాక్ బెల్ట్, ఫోటోగ్రఫీ, రన్నింగ్‌లో ఛాంపియన్‌షిప్‌లు అదనపు అర్హతలు. ఫ్రిస్కో రీడీ హైస్కూల్ నుండి ఈసంవత్సరం నేషనల్ ఫైనలిస్ట్‌గా శ్రీజ ఉత్తీర్ణురాలైంది. లెనోక్స్ హిల్ న్యూరోసర్జరీ మరియు యుటి సౌత్ వెస్ట్రన్‌లో షాడోయింగ్ ద్వార అనుభవం సంపాదించిన శ్రీజ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్‌లో న్యూరోసైన్సెస్‌లో డిగ్రీ చేసి వైద్య వృత్తిలోకి ప్రవేశించాలన్నది అభిలాష. శ్రీజ మరియు శ్రీజ చెల్లెలు ఈశాలను కూచిపూడి నృత్యానికి పరిచయం చేసిన తొలి గురువులు డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభ వాసిలి దంపతులను తల్లితండ్రులు శ్రీమతి శైలజ మరియు చంద్ర సూరిసెట్టి దుశ్శాలువాలుతో సత్కరించారు.
ఈ సందర్భంగా కూచిపూడి నృత్య ప్రశస్త్యాన్ని, పద్మవిభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారి నృత్య ప్రస్థానాన్ని, ఒక కొమ్మ వేయి రెమ్మలుగా యావత్ ప్రపంచం విస్తరించిన మద్రాసు కూచిపూడి ఆర్ట్ అకాడమీ వైభవాన్ని డాక్టర్ రమణ వివరించారు. నృత్యరంగంలో మద్రాసు కూచిపూడి ఆర్ట్ అకాడమీ విద్యారంగంలో హార్వర్డ్ మరియు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయాలతో సమానం అని, అకాడమీలో నృత్యం నేర్చుకున్న వేలాది మంది కళాకారులుగా ఈనాటికి రాణిస్తున్నారని చెప్పారు. శాంతినికేతన్, కేరళ కళామండలం, మద్రాసు అడయార్ కళాక్షేత్రం, కూచిపూడి ఆర్ట్ అకాడమీలు వే లమందిని మహోన్నత కళాకారులుగా తీర్చిదిద్దాయని శ్రీ రమణ కొనియాడారు. డాక్టర్ రమణ మద్రాసు కూచిపూడి ఆర్ట్ అకాడమీలో శ్రీమతి పద్మ సొంటి హైదరాబాద్ కూచిపూడి ఆర్ట్ అకాడమీలో నృత్యం నేర్పుకోవడం విశేషం.
Dr. Ramana Vasili
Indian Ballet Theater
School of Kuchipudi Dance
7062 Beringer Drive South
Cordova, Tennessee 38018
Cell: 901-387-9646
Email: ramanavvasili@hotmail.com







