భారత ఐటీ కంపెనీలకు ట్రంప్ షాక్
దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీల లాభాలపై అమెరికాలో హెచ్1 బీ వీసాల విధానంలో సవరణ ప్రభావం పడనుంది. ఈ కంపెనీల లాభాలు 2019-20 నాటికి 0.8శాతం తగ్గవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డాలరు విలువలో మార్పు కారణంగా ఈ కంపెనీల ఆదాయం మాత్రం 7 శాతం నుంచి 8 శాతం వరకు పెరగవచ్చని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది. డిజిటల్ సర్వీసుల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో సాఫ్ట్వేర్ రంగం 180 బిలియన్ డాలర్ల మార్కును చేరవచ్చని పేర్కొంది. పరిశ్రమ నిర్వహణ లాభాలు 0.30 శాతం నుంచి 0.80 శాతం వరకు తగ్గవచ్చు. అమెరికాలో స్థానిక నియామకాలు భారీగా పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది.
వీసాల విధానంలో చోటు చేసుకొన్న సరికొత్త మార్పుల కారణంగా ఈ మార్పులు జరుగుతాయి అని తెలిపింది. భారత ఐటి రంగం సహజంగానే ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చాలా దేశాల కంటే తక్కువకు మానవవనరులు ఇక్కడి నుంచి అందుతాయి. కంపెనీల ఆదాయం 65 శాతం నిర్వహణ లాభాలు మానవవనరుల నుంచి అందుతాయి. అమెరికా వీసా నిబంధనలను సవరించినా అత్యధికంగా హెచ్1బి వినియోగదారుల్లో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు.













