అమెరికాకు స్పైస్‌జెట్ సేవలు
కరోనా వైరస్ పరిణామాలతో విమాన సేవలపై ఆంక్షలు అమలవుతున్న వేళ చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా అమెరికాకు ఫ్లయిట్ సర్వీసులు నడిపే అవకాశాన్ని దక్కించుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తమ సంస్థకు భారతీయ షెడ్యూల్ క్వారియర్ గా గుర్తింపునిచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో స్పైస్‌జెట్ అమెరికాకు విమాన సర్వీసులు నడిపే తొలి భారతీయ చౌకచార్జీల విమానయాన సంస్థ కానుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రమే భారత్- అమెరికా రూట్లో సర్వీసులు నిర్వహిస్తోంది. ఈ మార్గంలో సేవలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎంపిక చేసినే సంస్థగా తమకు గుర్తింపు లభించడం వల్ల అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరించేందుకు మరికాస్త తోడ్పాటు లభించగలదని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. ప్రతీ సంక్షోభంలోనూ ఒక అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో స్పైస్‌జెట్ దీటుగా రాణించి, కీలకపాత్ర పోషించింది అని పేర్కొన్నారు.













