దేవుడు ప్రళయాలను సృష్ఠిస్తాడా?
యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత| అభ్యుత్థాన మధర్మస్య తదా త్మానం సృజామ్యహమ్||
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్| ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||
కేరళలో జరిగిన ఉత్పాతము తరువాత చాలా మంది అడిగిన ప్రశ్న ఇది. కొంచెం వివరణ అవసరమే. నిజానికి ఈ ప్రశ్నకి సమాధానం కేవలం హైందవ మతం మాత్రమే ఇవ్వగలదు. నాకు తెలిసినంతలో ప్రయత్నిస్తాను. ముందు వేరే ఉపమానంతో ప్రయత్నిద్దాము. పరబ్రహ్మాన్ని ఒక సర్వోత్కృష్ఠ ప్రభుత్వంతో పోల్చి చూద్దాము (ఇది ఉపమానము మాత్రమా సుమా! ఏ ఉపమానానైనా ఎక్కువ దూరం లాగితే తెగుతుంది).
ఏదైనా మనుషులందరినీ (అన్ని మతాలవారిని కూడా) సమానంగా చూడగలిగిన సర్వోత్కృష్ఠ ప్రభుత్యం (పరబ్రహ్మ) ఒకటి ఉంది అనుకుందాము. అట్టి ప్రభుత్వానికి ఒక రూపము లేదా వ్యక్తిత్వము ఉండదు. కనుక నీ పైన దానికి ఒక ప్రత్యేకమైన అభిమానము కానీ ద్వేషము కానీ ఉండే అవసరం లేదు. కానీ అందులో పదవులు నిర్వహించే వ్యక్తులకి నామరూపాలు, గుణాలు ఉంటాయి. ఆ వ్యక్తిత్వముతో వీరు తమ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. వీరికి అందరి పైనా సమభావము ఉండరాదు. మంచి చేసిన వారిపై మంచి భావము ఉండి, చెడు చేసిన వారిని శిక్షించాలి. అది వారి బాధ్యత. అంటే ప్రభుత్వానికి (పరబ్రహ్మ) నీ పైన ప్రత్యేకమైన అభిప్రాయము ఉండదు. కానీ పోలీసుకు (ఒక దేవతకు) శిక్షించే బాధ్యత ఉంటుంది. ఒక మంత్రికి (మరొక దేవతకు)నిన్ను రక్షించే బాధ్యత ఉంటుంది. మరొక ప్రభుత్వ అధికారికి (మరొక దేవతకు) నిన్ను సజావుగా నడిపించే బాధ్యత వుంటుంది. అంటే నీ కేమైనా కావాలంటే ఈ పదవులున్న వారినే కోరుకోవాలి. కానీ నామగుణరూపాలు లేని ప్రభుత్వవ్యవస్థ అనబడే బ్రహ్మపదార్ధాన్ని (పరబ్రహ్మని) కోరుకోవడము సాధ్యమే కాదు.
అంటే పరబ్రహ్మ అందరి పైన సమభావము కలిగి ఉండటం చేత, ఎవరికీ వరాలు ఇవ్వడు, ఎవరినీ శిక్షించడు. కానీ త్రిమూర్తులు, ఇంద్రాది దిక్పాలకులకులు, నవగ్రహాలు అనబడే దేవతలకు పదవులు, రూపాలు, వ్యక్తిత్వాలు ఉండి వారివారి బాధ్యతల మేరకు నీకు వరాలు ఇస్తారు, శిక్షలు కూడా అమలు చేస్తారు.
మన పరబ్రహ్మనే ఇతర మతాలవారు యహోవా అనీ, అల్లా అనీ, మున్నగు నామాలతో పిలుస్తారు కానీ, ఆయన ఎవ్వరికీ కనపడడు. మిగితా దేవతా రూపాలతో నిండిన సంపూర్ణదేవతావ్యవస్థ వేరే మతస్తులకు తెలియదు కనుక, వారు ఆయా దేవతలను ప్రార్దించి ప్రసన్నులను చేసుకోలేరు (నేరుగా పరబ్రహ్మను ప్రత్యక్షము చేసుకోవడం అసాధ్యమే కాదు, అసంబద్ధము కూడా. కనుక వారి ప్రార్ధనలు ఫలించే అవకాశము తక్కువ). ఇట్టి దేవతావ్యవస్థ పట్ల అవగాహన కేవలము సనాతనధర్మమే గుర్తించగలిగింది. ఈ దేవతావ్యవస్థ తెలియకపోతే అది అజ్ఞానము అవుతుంది. అజ్ఞానంతో వేరే మతం పుచ్చుకున్నానంత మాత్రాన అక్కడ పరిపాలనలో మార్పేమీ ఉండదు, ఎవరూ ఈ వ్యవస్థకి దూరంగా పోలేరు, ఏ శిక్షలను తప్పించుకోలేరు, అలాగే ఏ వరాలనూ పొందలేరు. ఏ మతాన్ని నమ్ముకున్నా సరే ఎవరూ ఈ వ్యవస్థకు అతీతులు కాలేరు. ఇక్కడ నమ్మికతో పని లేదు. నమ్మినా నమ్మకున్నా ప్రభుత్వయంత్రాంగం తనపని తాను చేసుకుపోయినట్టు, ఈ దేవతావ్యవస్థ కూడా అందరికీ ఎవరెవరి కర్మలను బట్టి వారివారి ఫలితాలను ప్రసాదిస్తూనే ఉంటుంది.
సరే దేవతలు శిక్షించారు అంటే వారేమీ పని కట్టుకుని నిన్ను కక్షతో శిక్షించరు. అలాగే వరాలు కూడా ఊరకనే ఇవ్వరు. నీ కర్మను బట్టి నీకు రావలసిన మంచినిగానీ, శిక్షనుగానీ అమలు చేస్తారు. అంటే నిజానికి దేవతల రూపంలో నీ కర్మే అన్ని పనులూ చేయిస్తూ వుంటుంది.
రుద్రమంత్రాన్ని అర్దం చేసుకుంటే, వర్షమూ ఆయనే, ఉప్పెనా ఆయనే, అకాలమూ ఆయనే; వైద్యుడు ఆయనే, కిరాతుడూ ఆయనే; దాత ఆయనే, చోరుడూ ఆయనే. ఆరోగ్యమూ ఆయనే, రోగమూ ఆయనే. మంచి చేసేవాడూ ఆయనే, నిన్ను శిక్షించే వాడూ ఆయనే. అన్నీ ఆయనే. కానీ నీకు ఏది సంభవించినా, అది మంచైనా లేక చెడైనా అన్నీ నీ కర్మానుసారమే జరుగుతాయి.
భగవద్గీతలో చెప్పినట్టుగా ధర్మహాని జరిగినప్పుడు అవతారమెత్తి శిక్షించేదీ ఆయనే, యోగులకు వరాలిచ్చి రక్షించేదీ ఆయనే. అందుచేత దేవుడు అంటే కేవలం మంచే చేస్తాడు, పాపులందరినీ క్షమిస్తాడు అని అనడము సుద్దతప్పు. తప్పు చేసేవాళ్ళందరినీ క్షమించేస్తే లోకంలో ఇక మంచి చేసేవాడే ఉండడు. అందరూ దుర్మార్గులే ఉంటారు. అసలు తన గాంగులో చేరటానికి ఒప్పుకున్న పాపులందరినీ క్షమించేవాడు సైతాను అవుతాడు కానీ దేవుడేలా అవుతాడు? దేవుడు తప్పు చేసిన వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టి, అలా మంచివారిని చెడ్డవారి బారినుంచీ కాపాడతాడు. ఇక ఆ దేళ్లందరికీ పైన ఉన్న పరబ్రహ్మము దేనికీ అంటీముట్టనట్టు ఉండే ఒక నిర్వికల్ప మహాచైతన్యము. అది మహాయోగులకి తప్ప ఎవరికీ అర్ధం కాదు.
అయ్యప్పస్వామి ఒక దేవతా రూపము (సైతాను కాదు). ఆయన మంచివారికి వారివారి కర్మలను బట్టి మంచి చేస్తాడు. అలాగే చెడ్డవారికి వారివారి కర్మలను బట్టి శిక్ష కూడా వేస్తాడు. అంతే కాదు ఎవరైనా వరదలో చనిపోయారు అంటే అది కేవలము శిక్షే కానక్కరలేదు. మంచివారు చనిపోతే వారికి మోక్షం సిద్ధించింది అని అర్దం చేసుకోవాలి.
శివుడు ప్రళయ కారకుడు. ప్రళయంలో నశించిన వారందరికీ శిక్ష పడిందని కాదు. ఆయన మోక్షం ఇద్దామనుకున్న వారినీ, శిక్షించాలని అనుకున్న వారినీ, ఇద్దరినీ ఒక దగ్గిరకి చేర్చి ఒకే సారి తన ప్రళయంతో ముంచి తీసుకెళ్తాడు. ఇద్దరికీ మరణమే సంభవించినా కూడా, ఇద్దరికీ తమతమ కర్మలను బట్టి వేరువేరు ఫలితాలు ప్రసాదిస్తాడు. ఇది కర్మ సిద్ధాంతం.
ఇది ఏదో ఒక ప్రకృతి వైపరీత్యము, కాకతాళీయంగా కొందరు చనిపోయారు అంతే. అని అడ్డదిడ్డముగా హేతురహితంగా చెప్పదు హైందవమతము. అన్ని సహేతుకంగా, స్పష్టంగా చెప్పగలిగింది కేవలం హైందవ మతము మాత్రమే. అందుకే ఇన్ని దేవతా రూపాలూ, ఆయా పాలనా వ్యవస్థలూనూ.
ఐతే కేరళలో ఎవరు మోక్షం పొందారు, ఎవరు శిక్షించబడ్డారో చెప్పే సామర్ధ్యం మనకు లేదు కనుక, ఆ విషయంలోకి పోవద్దు. కానీ స్వామి ఆగ్రహపాత్రులము కాకూడదు అని తెలుసుకోవాలి. స్వామి ఆగ్రహిస్తే ఆయన పాటించే ధర్మము అందరి పట్లా ఒకటే (నీ మతము ఏదైనా కూడా) అని తెలుసుకోవాలి. ఆలయ ఆచారాలను బ్రష్టుపట్టించరాదని తెలుసుకోవాలి. అన్నీ నాకే తెలుసు అని మిడిమిడిజ్ఞానముతో విర్రవీగుతూ ఆలయవ్యవహారాలలో జోక్యము చేసుకోకూడదు అని తెలుసుకోవాలి, అలా అందరూ అన్ని మతాలవారూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి.
వరదబాధితులకి సహాయం చేయడము మానవత్వము. అందుకని మతాలకు అతీతంగా మంచివారికీ చెడ్దవారికీ అందరికీ సకలజీవులకూ సహాయం అందించండి.
అది మన ధర్మము.
– రావు తల్లాప్రగడ (యుఎస్ఎ)













