సౌత్ ఆఫ్రికాలో ఘనంగా సంక్రాంతి సంబురాలు … పాల్గొన్న వెంకట్ ఎస్. మేడపాటి
ప్రవాసాంధ్రలకు సేవందించడమే తమ సంస్థ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడు వెంకట్ ఎస్.మేడపాటి పేర్కొన్నారు. సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ (ఎస్ఏటీసీ) ఆధ్వర్యంలో జోహెన్నెస్ బర్గ్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబురాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ అన్ని పండుగలను జరుపుకోవడం అభినందించదగిన విషయమన్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఎక్కువగా నివసిస్తున్న దేశాల్లో సౌతాఫ్రికా ఒకటన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ప్రవాసాంధ్రులకు సేవలందించేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ కృషి చేస్తోందని వివరించారు.
ఏపీఎన్ఆర్టీఎస్ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలను మెరుగుపరుచుకోవడానికి పలు కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ అందించడం, ప్రవాసాంధ్ర బీమా భరోసా, ఉచిత అంబులెన్స్ సేవ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను స్వదేశానికి తీసుకురావడం, దేవాలయాల దర్శనం వంటి ఎన్నో సేవలు అందిస్తున్నట్లు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమం భాగంగా అమ్మఒడి, నాడు-నేడు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారం అందించడం సంతోషకరమన్నారు. ప్రవాసాంధ్రులను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ కనెక్ట్ టు ఆంధ్రా కార్యక్రమానికి పిుపునిచ్చారని పేర్కొన్నారు.
పెట్టుబడులకు ముందుకు రావాలి :
ప్రవాసాంధ్రులు తమ సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని వెంకట్ ఎస్ మేడపాటి పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం తగిన సహాయం, అవకాశాలు, ప్రోత్సహకాలను అందిస్తుందని తెలిపారు. అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని, అన్ని ప్రాంతాలకు విస్తరించాలనే దృఢ సంక్పంతో సౌతాఫ్రికా తరహాలో మూడు రాజధానుల నిర్ణయం చేయడం జరిగిందని వివరించారు. దీనికి తెలుగువారంతా ముందుకు వచ్చి మద్దతు పలకాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సౌతాఫ్రికా తెలుగు కమ్యూనిటీ చైర్మన్ వెంకట్ మాగంటి, ప్రెసిడెంట్ విక్రమ్ పెట్లూరు, ఎస్ఏటీసీ గవర్నింగ్ బాడీ సభ్యులు మనోజా రాజవరపు శ్రీకృష్ణారెడ్డి, సుధీర్ బోనం, పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు.













