అమెరికా ప్రతినిధులతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ భేటీ
విదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్వవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 16న అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటనకు వెళ్లిన మంత్రి లోవా స్టేట్ వ్వయసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతాంగ సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, తక్కువ పెట్టుబడితో అంతర్జాతీయంగా మేలైన వ్యవసాయ పద్దతులను వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను రాబట్టే చర్యలను చేపడుతున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే ఐదు రోజుల పర్యటన నిమిత్తం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పర్యటనకు రావడం జరిగిందన్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన లోవా స్టేట్ ప్రతినిధులు సంపూర్ణ సహకారం అందిస్తామని ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే కర్నూలులలో ఏర్పాటు చేయనున్న మెగా విత్తన పార్కు ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అయోవా విశ్వవిద్యాలయం అధికారులు కూడా తమ సహకారాన్ని అందించేందుకు ముందకు వచ్చారన్నారు. ఈ ఐదు రోజుల పర్యటనలో అమెరికాలో వ్యవసాయ రంగ ప్రముఖులు, శాస్త్రవేత్తలతో పలు అంశాలపై చర్చలు జరుపనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ సమావేశంలో లోవా స్టేట్ వ్యవసాయ శాఖ మంత్రి బిల్ నార్తే, డిప్యూటీ సెక్రటరీ మైఖెల్ నైగ్, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.













