కరోనా దెబ్బతో భయపడుతున్న టెకీలు
అమెరికాలో కరోనా దెబ్బకు ఓవైపు మనుష్యులే పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు కంపెనీలు కూడా తమ వల్ల వ్యాపారం చేయలేమంటూ బోర్డులను కిందకు పడేస్తున్నాయి. ప్రపంచంలో అగ్రరాజ్యమైనా అమెరికాలోనే ఈ పరిస్థితి ఉంటే ఇతర దేశాల్లో ఈవిధంగా కరోనా మహమ్మారి విజృంభిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేము. ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందో తప్ప తరగడం లేదు. దానికితోడు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్నారు. కొన్నిచోట్ల మాత్రమే పరిస్థితి ఈ విధంగా ఉంది. మరికొన్ని చోట్ల లాక్డౌన్ కారణంగా ప్రజల ప్రాణాలకు పెద్దగా ముప్పు ఎదురవనప్పటికీ అక్కడ పనిచేస్తున్న వ్యాపార సంస్థలకు మాత్రం పెద్ద నష్టాన్నే కలిగించింది. దాంతో చాలాచోట్ల కంపెనీలు బోర్డ్‌ను తిప్పే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ తీసుకువచ్చిన ఇమ్మిగ్రేషన్ సంస్కరణల కారణంగా గతంలోలాగా ఏదో ఓ చోట కొలువు చూసుకుని బయటపడే పరిస్థితులు నేడు లేవు. దాంతో తాము ఇండియాకు వెనక్కి వెళ్ళిపోదామా అంటే తిరిగి వెళ్ళడానికి విమానాలు కూడా లేవు. దీంతో వాళ్ళు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు.
రవాణా, ట్రావెలింగ్ రంగాలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించడంతో ఈ రంగాలకు చెందిన కంపెనీలు తమ ప్రాజెక్టుల నుంచి ఉద్యోగులను తీసేయడం ప్రారంభించాయి. దీంతో ఉద్యోగులు వెంటనే మరో ప్రాజెక్టులో చేరలేని పరిస్థితి ఏర్పడింది. భారత్‌లో ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇలానే ఉన్నట్టు కనపడుతోంది. భారత్‌లోని టెక్ కంపెనీల క్లైంట్లు ఎక్కువగా అమెరికాకు చెందిన వారే కావడం.. వీరంతా కరోనా కారణంగా తమ ప్రాజెక్టులను ముందుకు నడిపే స్థితిలో లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీంతో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేయాల్సి వస్తోంది. భారత్‌కు చెందిన అనేక టెక్నాలజీ కంపెనీలు ప్రాజెక్టులు లేకపోయినా ఉద్యోగులను నడుపుకుంటూ వచ్చే సామర్థ్యం కలిగి ఉన్నాయి.
మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికమాంద్యం తలెత్తితే లక్ష ఉద్యోగాలు పోవడం తథ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై ఎక్కువగా ఉండవచ్చంటున్నారు. అమెరికాలో హెచ్1బీ వీసాపై సింహభాగం భారతీయులే పనిచేస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో హెచ్1బీ వీసాపై పనిచేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగం కోల్పోయినవారిని, ఇతరులను ఆదుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉద్యోగం పోయిన వాళ్లే కాకుండా.. సొంత వ్యాపారం చేసుకునే వారిని, ఫ్రీ లాన్సర్లను కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చింది. దీంతో ఉద్యోగం పోయిన వారు, ఉద్యోగం లేని వారు ఇలా అనేక మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా అమెరికా వ్యాప్తంగా 66 లక్షల మంది తాజాగా తమ మొదటి వారం నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసినట్టు లేబర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఈ లెక్కల ద్వారా అమెరికా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ఆరు శాతం మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసినట్టుగా అధికారులు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా.. అమెరికాలో 2007-09 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి కోసం అత్యధికంగా 6,65,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో మాంద్యం కారణంగా 87 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. తరువాత నేడు దగ్గరదగ్గరగా నిరుద్యోగభృతికి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య కనిపిస్తోంది.
అమెరికాలో ఉండేందుకు గడువు పెంచండి
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల వాణిజ్య కార్యకలాపాలన్నీ దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో పెద్ద ఎత్తున లే ఆఫ్‌లు ప్రకటిస్తారని భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హెచ్-1బి వీసాలు కలిగివున్న విదేశీ సాంకేతిక నిపుణులు ట్రంప్ ప్రభుత్వానికి ఒక పిటిషన్పెట్టుకున్నారు. వీరిలో ఎక్కువమంది భారతీయులే. ఉద్యోగం పోయిన తర్వాత అమెరికాలో వుండే కాలపరిమితిని ప్రస్తుతమున్న 60 రోజుల నుండి 180 రోజులకు పెంచాలని వారు కోరుతున్నారు. ఇమ్మిగ్రెంట్ యేతర వీసా కేటగిరీలోకి వచ్చే ఈ హెచ్-1బి వీసా కింద అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నిపుణులైన విదేశీయులను తమ ఉద్యోగులుగా నియమించుకోవచ్చు. దీంతో ప్రతి ఏటా భారత్, చైనాల నుండి వేలాదిమంది ఉద్యోగులను సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకుంటూ వుంటాయి. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం, ఒకవేళ ఉద్యోగం గనుక పోయినట్లైతే సదరు వ్యక్తి తన కుటుంబంతో సహా 60రోజుల్లోగా అమెరికా వదిలి వెళ్ళాల్సి వుంటుంది. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో అమెరికాలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున లే ఆఫ్ ప్రకటించే అవకాశం వుందని ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
మార్చి 21తో ముగిసిన వారానికి రికార్డు స్థాయిలో 33లక్షల మంది అమెరికన్లు ఉద్యోగం పోయిందని దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా రెండు వారాల్లో కరోనా సంక్షోభం మరింత ముదిరే అవకాశం వుండగానే ఇప్పుడే లక్షలాదిమంది నిరుద్యోగులయ్యారు. దాదాపు 47లక్షల మందికి నిరుద్యోగులుగా మారే అవకాశం వుందని భావిస్తున్నారు. హెచ్-1బి వీసాలు కలిగివున్నవారు నిరుద్యోగ భృతికి, సామాజిక భద్రతా ప్రయోజనాలకు అర్హులు కారు. ఇప్పటికే కొంతమంది హెచ్-1బి ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొంతమందికి త్వరలో తీసివేసే అవకాశాలు వున్నాయని ఇప్పటికే యాజమాన్యాలు తెలియచేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో హెచ్-1బి వీసాదారులు వైట్‌హౌస్‌కు ఆర్జి పెట్టుకున్నారు. ఉద్యోగం పోయినా మమ్మల్ని అమెరికాలో వుండనివ్వండి వెబ్సైట్లో పిటిషన్ పెట్టారు. ఒకవేళ ఉద్యోగం పోయినా కనీసం ఆరు నెలల వరకు వుండేందుకు అను మతించాలని కోరారు. ఇప్పటివరకు ఈ పిటిషన్‌పై 20 వేల మందికి పైగా సంతకాలు చేశారు. వైట్‌హౌస్ నుండి ప్రతిస్పందన రావాలంటే కనీసం లక్ష సంతకాలు కావాలి. ఏదీ ఏమైనా అమెరికాలో కరోనా వైరస్ మనుష్యుల ప్రాణాలనే కాకుండా కంపెనీలకు కూడా నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంతోమంది ఉద్యోగాలకు ఎసరు పెట్టిందని చెప్పవచ్చు.













