భారత్ కు అమెరికా మద్దతు
భారత్తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆరు అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు వివరించింది. భారత్-అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్వవస్థ 9వ విడత చర్చల అనంతరం రెండు దేశాలు ఈ సంయుక్త ప్రకటన వెలువడింది. ఈ చర్చలకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే, అమెరికా ఆయుధ నియంత్రణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల శాఖ కార్యదర్శి ఆండ్రియా థాంప్సన్లు అధ్యక్షత వహించారు. పౌర అణు ఇంధన రంగంలో సహకారం కోసం రెండు దేశాలు 2008 అక్టోబర్లో ఒక చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎన్ఎస్జీలోకి భారత్ త్వరగా ప్రవేశించాలన్న ఆకాంక్షను అమెరికా తాజాగా పునరుద్ఘాటించింది. ఇందుకు తన మద్దతు ఉంటుందని తెలిపింది.
అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఏర్పాటైన ఈ కూటమిలో భారత చేరికను చైనా అడుడకుంటోంది. అంతర్జాతీయ భద్రత, అణ్వస్త్ర వ్యాప్తికి సంబంధించిన సవాళ్లపై కూడా తాజా భేటీలో భారత్, అమెరికా చర్చించుకున్నాయి. సామూహిక జనహనన ఆయుధాలు, వాటిని చేరవేసే క్షిపణులు వంటి వాటి వ్యాప్తిని అడ్డకునేందుకు కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి ఆయుధాలు ఉగ్రవాద ముఠాల చేతిలో పడకుండా చూడాలని తీర్మానించుకున్నాయి. అంతరిక్ష రంగంలో పొంచి ఉన్న ముప్పులపై కూడా దృష్టిసారించాయి.













