అమెరికాలో ఐటీ నిపుణుల కొరత.. హెచ్1బీ కోటాను పెంచాలి
అమెరికాలోని భారతీయ అమెరికన్లకు చెందిన 2,100 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యమున్న నిపుణుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. సమస్య పరిష్కారానికి హెచ్`1బీ వీసాల కోటాను ప్రస్తుత 65 వేల నుంచి రెండింతలు చేయాలని అవి కోరుతున్నాయి. ఈ మేరకు ఐటీ సర్వ్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ మహాజన్ ఆధ్వర్యంలో 240 మందికి పైగా సభ్యులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. దేశ చరిత్రలో మొదటిసారి నిపుణుల కొరతపై కాంగ్రెస్ సభ్యులకు, సెనేటర్లకు నేరుగా వివరించాలని నిర్ణయించారు.
అమెరికాలోని 23 రాష్ట్రాల్లో ఉన్న మా కంపెనీల్లో 1.75 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశ జీడీపీకి 12 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. అయితే అత్యంత నైపుణ్యమున్న నిపుణుల కొరత కారణంగా మేం అధికంగా నష్టపోతున్నాం. అదే సమయంలో దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. హెచ్1బీ వీసాలను ఏడాదికి ప్రస్తుతమున్న 65 వేల నుంచి 1.30 లక్షలకు పెంచాలి. అలాగే నిపుణులను దేశీయంగానే తయారు చేసుకోవడానికి అమెరికన్ విద్యావ్యవస్థలోని స్టెమ్ విభాగంపై చేస్తున్న ఖర్చును మరింత పెంచాలి అని మహాజన్ వివరించారు.






