అమెరికాలో మరోసారి కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపొలిస్ నగరంలో ఒక పంక్ రాక్ షోలో (మ్యూజిక్ షో) కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత వారు అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయారని అధికారులు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారు తమంతట తాముగా ఆసుపత్రికి వెళ్లారు. మ్యూజిక్ షోలో పాల్గొన్న వారిని నిందితులు కావాలనే టార్గెట్ చేసుకుని ఉంటారని పోలీస్ చీఫ్ బ్రయన్ తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. అప్పటి వరకు అంతా బానే ఉంది. కానీ ఆ మరుక్షణమే కాల్పులు జరిగాయి. తూటాల నుంచి తప్పించుకునేందుకు అందరూ నేలపై పడుకున్నారు అని ఆ మ్యూజిక్ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకుడు ఒకరు తెలిపారు. కాగా, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.













