అమెరికా అమ్మాయిలకు రిలే స్వర్ణం
మహిళల 4×100 మీటర్ల రిలే పసిడిని అమెరికా సొంతం చేసుకుంది. ఫైనల్లో షకారి, గాబ్రియల్, టెర్రీ, మెలీసాతో కూడిన యూఎస్ బృందం 41.78 సెకన్లలో రేసు ముగించి అగ్రస్థానంలో నిలిచింది. 100 మీ. పరుగులో రజతం గెలిచిన షకారి ఇప్పుడు రిలే బృందంతో కలిసి ఒలింపిక్స్లో తొలి పసిడిని సొంతం చేసుకుంది. 100 మీ. పరుగులో మెలీసా కాంస్యం నెగ్గింది. గాబ్రియల్ 200 మీ. పరుగులోనూ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. బ్రిటన్ ( 41.85సె), జర్మనీ (41.97సె) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నాయి. మరో వైపు పురుషుల 4×100మీ. రిలేలో అమెరికా పతక కరువు కొనసాగుతూనే ఉంది. 20 ఏళ్లుగా ఈ విభాగంలో ఆ దేశం పతకం గెలవలేదు. ఫైనల్లో కోల్మన్, బెడ్నారెక్ నిబంధనలకు విరుద్దంగా బ్యాటన్ మార్చుకోవడంతో అమెరికా అనర్హతకు గురైంది. కెనడా (37.50సె), దక్షిణాఫ్రికా (37.37సె), బ్రిటన్ (37.61సె) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.







