సినీతారలకు వీసాలు నిరాకరిస్తున్న అమెరికా
దేశం కాని దేశంలో ఐక్యతను చాటుకునేందుకు ఏర్పాటు చేసుకున్న అమెరికాలో తెలుగు సంఘాలకు కిషన్ మోదుగుమూడి రూపంలో కొత్త కష్టం వచ్చి పడింది. వచ్చే నెలలో ఒక ప్రముఖ సంఘం నిర్వహించబోయే కార్యక్రమానికి సినీతారలకు వీసాలు నిరాకరించడంతో పాటు ఇతర ప్రమఖుల విషయంలోనూ అమెరికా పోలీసులు భారీ కోత విధించినట్లు సమాచారం. మామూలుగా అయితే ఈ సంఘాల నుంచి ఆహ్వానం అందిన వారందరికీ తాత్కాలిక వీసాలు మంజూరు చేస్తుంటారు. మోదుగుమూడి ఉదంతాన్ని అమెరికా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తుండటంతో నిరాకరిస్తున్నారు. సినీతారలను ఎందుకు పిలిపిస్తారని ఇటీవల సాంస్కృతిక సంస్థల నిర్వాహకులను అమెరికా పోలీసులు సూటిగా అడగ్గా, కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా చేసేందుకు, ఎక్కువ మంది హాజరయ్యేందుకు రప్పిస్తుంటామని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమాధానం పట్ల అధికారులు సంతృప్తి చెందలేదని, ఇందులో ఇంకా ఏదో మతలబు ఉందని అనుమానిస్తున్నారని, తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారని తెలుగు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. తెలుగు సంఘాలకు ఈ కుంభకోణంలో సంబంధం లేకపోయినా మోదుగుమూడి దంపతులు వాటి పేర్లు వాడుకున్నారు. దీంతో దీని ప్రభావం అన్ని తెలుగు సంఘాలపై పడింది. భవిష్యత్తులో సమావేశాలు ఎలా నిర్వహించాలా అని సంఘాల ప్రతినిధులు ఆందోళ చెందుతున్నారు.













