జయరామ్ కృషితో ఫలిస్తున్న డిజిటల్ తరగతుల ఏర్పాటు లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు ద్వారా చిన్నారులకు చిన్నప్పటి నుంచే సాంకేతిక అంశాలను నేర్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి చేపట్టిన చర్యలు నేడు ఫలప్రదం అవుతున్నాయి. అమెరికాలోని ఎన్నారైల తోడ్పాటుతో ఎపి జన్మభూమి కార్యక్రమం కింద పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుట్టారు. పలు నగరాల్లో పర్యటించి వివిధ సమావేశాలను ఏర్పాటు చేసి ఎన్నారైలను చైతన్యపరచడంతోపాటు వారు ఇచ్చిన విరాళంతో వారు కోరుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయించారు. దాదాపు 5000 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందుకు అనుగుణంగా మొదటి దశలో దాదాపు వెయ్యికిపైగా పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశామని, 13 జిల్లాల్లో వివిధ పాఠశాలల్లో 5000 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయాలనీ పెట్టుకున్న లక్ష్యం కూడా త్వరలోనే సాకారం కాబోతున్నదని జయరామ్ కోమటి చెప్పారు. ఇప్పుడు రెండోదశ కింద మరిన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు జయరామ్ కోమటి చెప్పారు. ఎన్నారైల తోడ్పాటుతో ఇప్పటికే పలు పాఠశాలలకు డిజిటల్ తరగతుల సామాగ్రిని పంపామని, ఈ పథకం కింద 70 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయగా, 30 శాతం నిధులను ఎన్నారైలు విరాళంగా ఇస్తున్నారని చెప్పారు. ఒక్కో తరగతి ఏర్పాటుకు లక్షన్నర రూపాయలు వ్యయం అవుతుందని, ఇప్పటికే డిజిటల్ తరగతులకు సంబంధించిన కంప్యూటర్, ప్రొజెక్టర్ తదితర పరికరాలు జిల్లాలకు పంపిణీ చేశామని, ఈ నెలాఖరులో వీటిని అధికారికంగా ప్రారంభిస్తామని జయరాం కోమటి తెలిపారు.













