కొవిడ్-19పై పోరుకు మరో 69 మందులతో ప్రయోజనం
కరోనాకు క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడొచ్చని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అయితే, కరోనాపై క్లోరోక్విన్లాగా ప్రభావం చూపే మరో 69 ఔషధాలను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది. భారత సంతతి శాస్త్రవేత్త కూడా ఒకరు ఆ బృందంలో ఉన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్ వంటివాటికి వాడే మందులను కరోనా చికిత్సలో కూడా వినియోగించవచ్చని వారు వివరించారు. పరిశోధనల్లో భాగంగా వారు కొవిడ్-19 వైరస్ 29 జన్యువుల్లో 26 జీన్స్‌ను పరీక్షించారు.
వైరల్ ప్రొటీన్ల ఉత్పత్తిలో కీలకమైన జన్యువులవి. ఆ జన్యువులు మనిషి కణాల్లో మొత్తం 332 ప్రొటీన్లతో ఇంటరాక్ట్ అవుతున్నాయని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 4,71,000 మందికి సోకడానికి.. 21 వేల మందికిపైగా ప్రజల ప్రాణాలు తీయడానికి.. కరోనా వైర్‌సకు ఆ 332 మానవ ప్రొటీన్లే సహకరించాయి. దీంతో, ఆ ప్రొటీన్లను టార్గెట్ చేసే మందులపై దృష్టిసారించిన పరిశోధకులు.. 69 ఔషధాలను గుర్తించారు. వాటిలో 25 ఔషధాలకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులున్నాయి. మరోవైపు.. కరోనా వైరస్ బాధితులకు ఇన్నాళ్లుగా ఇస్తున్న ప్రామాణిక చికిత్సకన్నా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెరుగైనదేమీ కాదని చైనాలో చేసిన ఒక చిన్న అధ్యయన ఫలితం తెలుపుతోంది. దాని ప్రకారం.. 30 మంది కొవిడ్-19 బాధితులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇవ్వగా ఏడు రోజుల తర్వాత 13 మందికి వైరస్ నెగెటివ్ రాగా.. 14 మందికి పాజిటివే ఉంది. అయితే, అజిత్రోమైసిన్‌తో కలిపి వాడితే మాత్రం సమర్థంగా పనిచేస్తున్నట్టు ఫ్రాన్స్ పరిశోధనల్లో తేలింది.













