మేం లేకుండా రెండు వారాలు కూడా పదవిలో ఉండలేరు
సౌదీ అరేబియాను ఎన్నో దశాబ్దాలుగా అమెరికా అత్యంత సన్నిహిత దేశంగా చూస్తున్నది. ఆ దేశ అధ్యక్షులంతా ఆ దేశానికి అధిక ప్రాధాన్యత కూడా ఇస్తారు. కానీ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ దేశాన్ని తీసి పారేశారు. అసలు అమెరికా సాయం చేయకుంటే సౌదీ అరేబియా రెండు వారాలు కూడా మనుగడ సాగించలేదని అన్నారు. ఈ విషయాన్ని తాను సౌదీ రాజు సల్మాన్‌తోనే చెప్పినట్లు ట్రంప్ గ్పొగా చెప్పుకున్నారు. సౌదీ అరేబియాను మేం రక్షిస్తున్నాం. వాళ్లు గొప్ప వాళ్లని మీరు అంటారు. నాకు కింగ్ సల్మాన్ అంటే ఇష్టం. కానీ నేను ఆయనతో, కింగ్ మేము మిమ్మల్ని రక్షిస్తున్నాం. మేము లేకుండా రెండు వారాలు కూడా వీరు ఉండరు. మీరు మీ మిలటరీ ఖర్చులు భరించాలి అని చెప్పాను అంటూ ట్రంప్ ఓ ర్యాలీలో గొప్పగా చెప్పుకున్నారు.
అయితే ఆయనతో ఈ మాటలు ఎప్పుడు చెప్పారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆ ప్రాంతంలో ఇరాన్‌కు చెక్ పెట్టడానికి సౌదీని అమెరికా వాడుకుంటున్నది. అందుకే మొదటి నుంచీ సౌదీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ట్రంప్ కూడా అధ్యక్షుడిగా తన తొలి అంతర్జాతీయ పర్యటనను సౌదీ అరేబియా నుంచే మొదలుపెట్టారు. ప్రపంచంలో అత్యధిక ముడి చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియానే. అయితే పెరిగిపోతున్న ముడి చమురు ధరల విషయంలోనూ సౌదీ కింగ్‌నే ట్రంప్ విమర్శించారు. ఓపెక్ దేశాలు ప్రపంచాన్ని దోచుకుంటున్నాయని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ అన్నారు.













