సౌదీ సంచలన నిర్ణయం!
సౌదీలో పౌర చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇక మహిళల పట్ల ఉండే ఆంక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లోవారి అనుమతి లేనిదే ఆడవాళ్లు కాలు బయటపెట్టడానికి వీలుండదు. అది కూడా మగతోడు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే తాజాగా సౌదీ సంచలన నిర్ణయం తీసుకుంది. వయోజన మహిళల (21 ఏళ్లు దాటిన)ను ఎలాంటి అనుమతి లేకుండా ఒంటిరిగానే ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. అలాగే కుటుంబ విషయాలపై వారికి మరింత నియంత్రణ ఇచ్చింది. పిల్లల జననం, వివాహం (లేదా) విడాకులను నమోదు చేయడం, అధికారిక కుటుంబ పత్రాలు జారీ చేయడం, మైనర్లకు సంరక్షకుడిగా వ్యవహరించేందుకు తాజాగా సవరించిన నిబంధనలు సౌదీ మహిళలకు అవకాశం కల్పిస్తున్నాయి.
సాంప్రదాయక ముస్లిం రాజ్యాన్ని మార్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆలోచనతో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల బహుళ సామాజిక ఆంక్షలను ఎత్తివేయడం జరిగింది. దీనిలో భాగంగానే మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కల్పించారు. అలాగే గతేడాది పురుష సంరక్షక వ్యవస్థను తొలగించడానికి సైతం మొహమ్ముద్ మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. లింగం, వైకల్యం, వయస్సు ఆధారంగా ఎటువంటి వివక్షతను ఎదుర్కోకుండా పని చేసే హక్కు పౌరులందరికీ ఉందని పేర్కొంటున్నాయి. 2030 నాటికి ఆర్థిక వ్యవస్థను మార్చడానికి ప్రిన్స్ మొహమ్మద్ 2016లో ప్రతిష్టాత్మక ప్రణాళికను ఆవిష్కరించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 22 శాతం నుండి 30 శాతానికి పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం.













