రాజంపేట బరిలో తానా అధ్యక్షుడు ?
అధిష్టానం ఆదేశిస్తే రాజంపేట ఎమ్మెల్యే స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తానని తానా అధ్యక్షుడు సతీష్ వేమన సృష్టం చేశారు. రాజంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు గ్రామస్థాయిలో పటిష్టమైన క్యాడర్ ఉందన్నారు. తాను విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీకి వీరాభిమానినన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పని చేశానన్నారు. తాను రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున పనిచేస్తూ ఆ పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానన్నారు. 22వ తేదీ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రాజంపేట అసెంబ్లీ కార్యకర్తల, నాయకుల సమావేశానికి తాను వెళుతున్నానని, ఆ సమావేశంలో తన అభిప్రాయాన్ని చంద్రబాబుకు, జిల్లా నాయకత్వానికి తెలియజేస్తానన్నారు.













