ట్రంప్ దెబ్బతో హెచ్ 1బీ ఉద్యోగులపై ప్రభావం : సతీష్ వేమన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న కఠిన నిర్ణయాలతో హెచ్1 బీ వీసాపై అగ్రరాజ్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు తలలు పట్టుకున్నారని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు సతీష్ వేమన ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం ఫలితంగా వీరు గ్రీన్ కార్డు పొందేందుకు కనీసం 40 ఏళ్లపాటు నిరీక్షించక తప్పదన్నారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా తన స్వస్థలమైన కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం బి.కమ్మపల్లెకు వచ్చిన సతీష్, కుటుంబ సభ్యులు, బంధువులతో సరదగా గడిపారు.
ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ అమెరికాలో హెచ్1బీ వీసాపై ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయులకు కష్టాలు తప్పవని, ఇప్పటికే 5 లక్షల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆరేళ్ల కన్నా ఎక్కువ కాలం నివాసం ఉండి గ్రీన్‌కార్డు రాకపోతే అమెరికా వదలి వెళ్లేలా నిబంధనలు మార్చారని, అయితే ఇది అమలు కానుందున 3 లక్షల మంది భారతీయులకు ఊరట లభించినట్లు తెలిపారు. మొత్తానికి ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసాలపై తీక్షణంగా పరిశీలిస్తోందన్నారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎఫ్ఐ వీసాలపై వస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, అమెరికా 4 బోగస్ యూనివర్సిటీలు మూతపడ్డాయని తెలిపారు.
40 ఏళ్లు పూర్తి చేసుకున్న తానా 40 వేల మంది కుటుంబ సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా గుర్తింపు పొందిందన్నారు 100 మిలియన్ డాలర్లతో తానా సేవా ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 50 వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, కేన్సర్, మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు భాష సంస్కృతులను పెంపొందించడానికి ఏటా రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. శంకర ఐ ఫౌండేషన్‌తో పాటు బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి తానా సహకరిస్తోందని తెలిపారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో వెయ్యి మంది తెలుగు వారి కోసం తానా స్వచ్ఛందంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.













