అట్లాంటా శంకర నేత్రోత్సవం
శంకర నేత్రాలయ ఓంట్రస్టు వారు నిధుల సేకరణకై అట్లాంటాలో నిర్వహించిన భరత నాట్య కార్యక్రమం “దృష్టి” అందరినీ అలరించింది. సుమారు రెండు లక్షల డాలర్ల విరాళాలు ఇచ్చి, అట్లాంటా వాసులు తమ దాతృత్వాన్ని చాటి చెప్పారు. స్థానిక ఇన్ ఫైనైట్ ఎనర్జీ సెంటర్ ఆడిటోరియం లో, సెప్టెంబరు 8 ఆదివారం మధాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 700 మంది రసజ్ఞులు హాజరయ్యారు. ప్రముఖ భరతనాట్యాచార్యులు, కలైవాణి డాన్స్ ఎకాడమీ సంస్థ వ్యవస్థాపకురాలు శ్రీమతి.పద్మజ కేలం గారు, వారి పుత్రుడు చిరంజీవి.సిద్ధార్థ్ కేలం సంయుక్తంగా నాట్య రీతులు సమకూర్చిన, డాక్టర్ ఉమ ఇయ్యుణ్ణి గారిచే రచింపబడిన, శ్రీమతి.ఆశ రమేష్ గారి చే స్వర పరచబడిన “దృష్టి” నాట్య విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
బహుభాషా కోవిదులు శ్రీ.జయకిరణ్ పగడాల గారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సంస్థ ట్రస్టీ శ్రీ.శ్రీని వంగిమళ్ళ గారు, ఉపాధ్యక్షులు శ్రీ.మూర్తి రేకపల్లి గారు, గౌరవాధ్యక్షులు శ్రీ ఆచార్యగారు, సంస్థ అధ్యక్షులు శ్రీ.బాల ఇందుర్తి గారు వచ్చినవారందరికీ ఆహ్వానం పలికి, క్లుప్తంగా తమ సందేశాలను వినిపించారు. పిమ్మట వేదికపైన కన్నులు చెదిరే ఒక అద్భుతం ఆవిష్కరింపబడింది. “దృష్టి” హాసిని అనే ఒక అమ్మాయి కథ. గలగలా నవ్వుతూ తుళ్ళుతూ ఉండే హాసిని తన స్నేహితురాళ్ళను చిన్న చూపు చూస్తూ, వారి బలహీనతలను ఎత్తి చూపిస్తూ, ఆకతాయిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక నాడు పాఠశాలలో ప్రయోగశాలలో జరిగిన దుర్ఘటన వలన హాసిని చూపు దెబ్బతింటుంది. ఆమెకు ప్రపంచం చీకటిమయమౌతుంది. ఆమె ఎంతో కలవరపడుతుంది. మెల్ల మెల్లగా తనలోని అంతర్దృష్టిని తెలుసుకుంటుంది. ఏ దృష్టి తెరుచుకోవడం వలన మనిషి మనిషిగా మనగలుగుతాడో, సాటి మనిషికి సహాయపడతాడో, భగవంతుని సృష్టిని సరిగా అర్థం చేసుకొనగలుగుతాడో, ఆ దృష్టిని గ్రహించగలుగుతుంది హాసిని. అప్పుడు ఆమె తను చేసిన తప్పులు తెలుసుకుంటుంది. మనసులోనే పశ్చాత్తాపపడుతుంది. వైద్యులు మళ్ళీ పరీక్షలు చేసి, ఎన్నో చికిత్సలు చేసి ఆమెకు మరలా సంపూర్ణమైన కంటి చూపు ప్రసాదిస్తారు. ఆమె ఆనందిస్తుంది. అయితే ఈ హాసిని ఇదివరకటి హాసిని కాదు. అంతర్ నేత్రం తెరుచుకున్న అసలైన హాసిని. అందుకనే ఎంతో హుందాగా, చక్కగా, మానవతతో ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఇదీ క్లుప్తంగా కథ. అంతర్ దృష్టి స్ఫుటమైననాడు, మానవుడే మాధవుడౌతాడు.
ఈ ప్రపంచం లో అందరి యెడలా సమదృష్టిని కలిగి, సానుభూతితో, సహృదయతతో సాటి మనిషికి సహాయపడడాన్ని మించిన పరమ ధర్మము మరొకటి లేదు. ఈ నీతిని సూటిగా, అందంగా చెప్పిన నృత్య రూపకం “దృష్టి”. చూసిన ప్రేక్షకులు మైమరచిపోయారు. కొందరి కళ్ళు చెమ్మగిల్లాయి, హృదయాలు ఉప్పొంగాయి, ఆనంద బాష్పాలు కురిసాయి. ఒక వెల్లువలా విరాళాలు వచ్చి చేరాయి. దరిదాపు 3000 నేత్ర చికిత్సలకు సరిపడా విరాళాను ఇచ్చి, తమ ఉదారతను చాటుకున్నారు అట్లాంటా వాసులు.
విరాళాల సేకరణలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ.బాల ఇందుర్తి గారు, శ్రీ.మూర్తి రేకపల్లి గారు, శ్రీ.శ్రీని వంగిమళ్ళ గారు, శ్రీ.రాజశేఖర్ రెడ్డి ఐల గారు, శ్రీ.మెహర్ లంకా గారు, శ్రీ.జయకిరణ్ పగడాల గారు, శ్రీమతి.పద్మజ కేలం గారు, శ్రీ.ఉపేంద్ర రెడ్డి రాచుపల్లి గారు, శ్రీ.రమేష్ చాపరాల గారు, శ్రీ.రాజీవ్ మీనన్ గారు, శ్రీ.సురేష్ వేములమాడ గరు, శ్రీమతి నీలిమ గడ్డమణుగు గార్లు అహర్నిశలూ శ్రమించి, రెండు లక్షల డాలర్ల విరాళాలు సేకరించడం శ్లాఘనీయం. సంస్థ అధ్యక్షులు శ్రీ.బాల ఇందుర్తి గారు ఈ విజయాన్ని అట్లాంటాలో ఈ సంస్థ వ్యవస్థాపకురాలు, ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి నగర నివాసిని, డాక్టర్ శేషు శర్మ గారికి అంకితమివ్వడం ముదావహం.
కార్యకర్తలు శ్రీ.కృష్ణదాస్ పిషరోది, శ్రీమతి.శ్రీకృప ఈశ్వరన్ , శ్రీ.ఫణి డొక్కా , శ్రీమతి.ఉమ నారాయణ్, శ్రీ.రాఘవబాబు తడవర్తి , శ్రీ.కమల్ సాతులూరు, శ్రీమతి.నమ్రత సాతులూరు, శ్రీ.రాజేష్ తడికిమళ్ళ, శ్రీ రమేష్ వల్లూరి, శ్రీ.వెంకట్ చుండి, శ్రీ.రవి కందిమళ్ళ, శ్రీ.సుబ్బారావు మద్దాలి, శ్రీ.రాం మల్లప్ప, శ్రీ.స్వదేష్ కటోచ్, శ్రీ.విజు చిలువేరు, శ్రీ.నిరంజన్ పొద్దుటూరి గార్లకు, బైట్ గ్రాఫ్ సంస్థకు శంకర నేత్రాలయ అట్లాంటా వారు కృతజ్ఞతలు తెలిపారు.
మొబైల్ ఐ సర్జికల్ యూనిట్స్ (మేస) కు విరాళాలను ఇచ్చిన శ్రీ.కృష్ణమూర్తి రేకపల్లి, మాధవి దంపతులకు, శ్రీ.అనిల్ జాగర్లమూడి, మహలక్ష్మి దంపతులకు, భారత దేశంలో ఎడాప్ట్ ఎ విలేజ్ ప్రాజెక్టులో భాగంగా ఒక పల్లెటూరును దత్తత తీసుకున్న శ్రీ మురళి రెడ్డి, బిందు దంపతులకు, డాక్టర్ సంజీవరెడ్డి, శ్రీదేవి దంపతులకు, శ్రీ.వేములమాడ సురేష్, డాక్టర్ మాధవి రాయపూడి గార్లకు, శ్రీ.శ్రీనివాస్ సూరపనేని,ప్రియ దంపతులకు, శ్రీ.శ్రీని రెడ్డి వంగిమళ్ళ, దీప దంపతులకు, శ్రీ.ప్రసాద్ మల్లు,నివేదిత దంపతులకు, శ్రీ.రవి రెడ్డి మరక, ప్రవీణ దంపతులకు, శ్రీ బాలకృష్ణ నూలి గారికి కృతజ్ఞతల నందజేసారు. ఈ యజ్ఞంలో పాలుపంచుకున్న స్థానిక సంస్థలైన తామా, గాటా, గేట్స్, గామా, గాట్స్, ఇఫా, మైత్రి మరియు అట్లాంటా తెలుగు సంస్కృతి సంస్థలకు శంకర నేత్రాలయ వారు అభినందనలు తెలిపారు.
ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ బి.కె మోహన్, రాజ్యలక్ష్మి దంపతులను, శ్రీ.ప్రమోద్ సజ్జ, ప్రతిమ దంపతులను, శ్రీ.టి.ఆర్ రెడ్డి, నిరంజిని దంపతులను, డాక్టర్ జి.ఎస్.విశ్వేశ్వర, శ్రీమతి వీణ భట్ గార్లను సన్మానించారు.
ఈ కార్యక్రమానికి సహాయం చేసిన అందరినీ, పేరు పేరునా వేదికమీదకు పిలచి జ్ఞాపికలను అందిచడం కొసమెరుపు. కొన్ని నెలల సమయాన్ని వెచ్చించి, పగలూ రాత్రీ కష్టపడి ఈ కార్యమాన్ని రూపొందించి, ఇంతటి బృహత్కార్యాన్ని సాధించిన సంస్థ అధ్యక్షులు శ్రీ.బాల ఇందుర్తిగారిని, ప్రేక్షకుల కరతాళ ధ్వనుల నడుమ, సభ్యులందరూ ఘనంగా సన్మానించారు.













