అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విదేశీ కుట్రల కలకలం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి విదేశీ కుట్రల కలలకం రేగింది. ముఖ్యంగా అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు రష్యా, ఇరాన్ ప్రయత్నిస్తున్నాయని అమెరికా నిఘా వర్గాలు ప్రకటించటం సంచలనం సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల మూడవ తేదీన జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల డెమోక్రటిక్ పార్టీ ఓటర్లకు అనుమానాస్పద ఈమెయిల్ సందేశాల వెల్లువ మొదలైంది. డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయకుంటే మీ అంతుచూస్తాం.. ఎన్నికల తర్వాత మీ పని చేస్తాం అని ప్రౌడ్బాయ్స్ అనే సంస్థ పంపినట్టుగా మెయిల్ సందేశాలు వస్తున్నాయి. అయితే, ఈ మెయిల్స్ వెనుక ఇరాన్ హస్తం ఉన్నదని, పోలింగ్ ముందు ట్రంప్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ రకమైన కుట్రకు తెరలేపారని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మీడియా సమావేశంలో ఆరోపించారు.













