TANA: తానా మహాసభల్లో అందమైన పాటలతో అలరించిన ఆర్పీ పట్నాయక్
డెట్రాయిట్ వేదికగా జరుగుతున్న తానా (TANA) మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ అందర్నీ అలరించారు. తన తొలి చిత్రం ‘నీకోసం’ సినిమా టైటిల్ ట్రాక్‌తో అందర్నీ పలకరించారు. అనంతరం సింహా అండ్ కో పాడిన ‘నువ్వులేక నేనులేను’ చిత్రంలోని ‘ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను?’ పాట అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాటను ఎంతోమంది అమ్మాయిలు అప్పట్లో తమ ప్రేమను తెలియజేయడానికి ఉపయోగించుకున్నారని ఆర్పీ పట్నాయక్ చెప్పడంతో ప్రేక్షకులు కూడా నవ్వేశారు. డెట్రాయిట్‌కు చెందిన వైష్ణవీ అనే అమ్మాయితో కలిసి కూడా పట్నాయక్ ఒక పాట పాడటం గమనార్హం. అలాగే ‘ఆ నలుగురు’ చిత్రంలోని ‘ఒక్కడై రావడం’ పాట పాడిన పట్నాయక్.. సినిమాలో ఈ పాటను పాడిన ‘గాన గాంధర్వుడు’ ఎస్పీ బాలును గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చివరగా అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. అందరూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు.







