రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా రవి వడ్లమాని
సమాజానికి తామేమి చేయాలో అని ఆలోచించేవాళ్ళు ఈ రొటేరియన్లు. సమాజం నుంచి వారు ఏమీ ఆశించరు కాని తాము ఏమి చేయాలో అన్నదే వారు ఎప్పుడూ ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిలో రవి వడ్లమాని ఒకరు. చార్టర్ అకౌంటెంట్‌గా ఉన్న ఆయన చిన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాలవైపు మొగ్గు చూపారు. తాను అభిమానించే మదర్ థెరిసాను కలుసుకున్నప్పుడు ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో సమాజానికి తనవంతు సాయం చేయాలనుకున్నారు. తన సేవకు దోహదపడే రోటరీక్లబ్‌లో చేరారు. సేవా కార్యక్రమాల్లో ఆయనకు ఉన్న శ్రద్ధ, సేవాభావం ఆయనను రోటరీక్లబ్‌కు అధ్యక్షుడిని చేసింది. రోటరీక్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టారు.
మంచినీటి సౌకర్యం, వైద్యం, కృత్రిమ అవయవాల పంపిణీ, మరుగుదొడ్ల నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలను రోటరీ ద్వారా చేశారు. 35 సంవత్సరాలుగా మానవ సేవకు అంకితమైన ఆయనను ఎన్నో పదవులు వరించాయి. రోటరీ గవర్నర్‌గా, రౌండ్‌టేబుల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా, నేడు రోటరీ అంతర్జాతీయ (ఇండియా) డైరెక్టర్‌గా రవి వడ్లమాని ఎదిగారు. దాదాపు 200 దేశాల్లో ఉన్న రోటరీ అంతర్జాతీయ సంస్థకు డైరెక్టర్‌గా ఎన్నికవడం అంటే సాధారణ విషయం కాదు. ఆయన చేస్తున్న సేవ, కార్యక్రమాలే ఆయనకు ఈ పదవిని తెచ్చిపెట్టింది. ఆయన సేవలకు గుర్తింపుగా నాగార్జున విశ్వవిద్యాలయం 2008 లో ఆయనకు హానరరీ డాక్టరేట్‌ను కూడా ప్రదానం చేసింది. పాలకమండలి సభ్యునిగా కూడా ఆయన ఉన్నారు.
రవి వడ్లమాని సతీమణి రాజ్యలక్ష్మి, ఆయన తండ్రి స్వర్గీయ ఉమామహేశ్వరరావు కూడా రోటరీ గవర్నర్లుగా పని చేసి సేవలను అందించడం విశేషం. ఒకే కుటుంబం నంచి ముగ్గురు గవర్నర్లు ప్రపంచంలోనే ఇది అరుదైన విషయంగా చెప్పవచ్చు. ఆయన జీవితం అంతా రోటరీతోనే, రోటరీలోనే గడిచిపోతోంది. గుంటూరు శ్యామలా నగర్ లో బ్రహ్మాండమైన సంతోషిమాత, గాయత్రీ దేవాలయ సముదాయాన్ని ఆయన నిర్మించారు. రెడ్ క్రాస్ సంస్థకు అధునాతన భవనాన్ని నిర్మించి, అక్కడ ఒక బ్లడ్ బ్యాంక్‌ను, అనాథశరణాలయాన్ని నిర్వహిస్తున్న సేవాతత్పరుడు రవి వడ్లమాని. ఆయన రోటరీ అంతర్జాతీయ డైరెక్టర్‌గా నియమితులైనందుకు ఎంతోమంది సంతోషాన్ని వెలిబుచ్చారు.













