ఈ బూట్ల ధర రూ.3 కోట్లకు పైమాటే
అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ నైకీ తయారుచేసిన ఓ బూట్లు వేలంలో రికార్డు ధర పలికాయి. 1972లో మూన్ షూ పేరుతో తీసుకొచ్చిన ఈ అరుదైన స్నీకర్స్ను సోథిబే సంస్థ వేలం వేసింది. ఇందులో ఈ బూట్లు ఏకంగా 4,37,500 డాలర్లు పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3 కోట్లకు పైమాటే. కెనడాకు చెందిన మైల్స్ నాదల్ అనే వ్యక్తి ఆన్లైన్ వేలంలో వీటిని దక్కించుకున్నారు. నైకీకి చెందిన మూన్ షూను దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని నాదల్ తెలిపారు. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడై ఈ స్నీకర్స్ సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాయి. 1984 ఒలిపింక్ బాస్కెట్బాల్ ఫైనల్స్ సమయంలో బాస్కెట్బాల్ ఆటగాడు మైఖెల్ జోర్డాన్ ధరించిన కాన్వర్స్ స్నీకర్స్ను 2017లో సోథిబే వేలం వేసింది. వేలంలో ఆ స్నీకర్స్ 1,90,373 డాలర్లు పలికాయి. ఇప్పటివరకు అదే ప్రపంచ రికార్డు కాగా తాజాగా నైకీ మూన్ షూ ఆ రికార్డును బద్దలుకొట్టింది.













