NATS: విదేశాల్లోనూ తెలుగును బతికిస్తున్న అందరికీ పాదాభివందనాలు.. నాట్స్ కాన్ఫరెన్స్‌లో రఘురామకృష్ణంరాజు
నాట్స్ (NATS) 8వ తెలుగు సంబరాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (RRR) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తను గతంలో యూఎస్‌లో పర్యటించి ఎంతో మంది తెలుగు వారిని కలిశానని, అప్పట్లో రాష్ట్రంలో మార్పు కోరుకున్న వాళ్లు, ఆ మార్పు వచ్చిన తర్వాత ఇంత ఘనంగా నాట్స్ తెలుగు సంబరాలు జరుపుకోవడం, దానికి తనను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గుత్తికొండ శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్, రవి ఐకా, డాక్టర్ ఆలపాటి తదితరులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంతో రాష్ట్రంలో చదువకుంటున్న విద్యార్థులను దత్తత తీసుకొని, వారికి మెరుగైన విద్యను అందించడానికి సహకరించాలని కోరారు. ఈ క్రమంలో మాతృభూమికి సేవ చేసే ఎన్నారైలకు తిరుపతిలో చక్కగా దర్శనం చేయిస్తానని, ఇదేమీ కండీషన్ కాకపోయినా చాలామంది ఎన్నారైలు తిరుమల గురించి అడగడంతోనే ఈ మాట చెప్తున్నానని రఘురామకృష్ణం రాజు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో కన్నా అమెరికాలోని పిల్లలే తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారని, తెలుగు సంస్కృతిని కాపాడుతున్న అమెరికాలోని తెలుగు వారికి పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. విదేశాల్లో కూడా తెలుగును బతికిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.







