పిట్స్ బర్గ్ లో డొనాల్డ్ ట్రంప్ నకు నిరసనల సెగ
ఇటీవల 11 మంది యూదులను దుండగుడు తుపాకితో కాల్చి పొట్టనబెట్టుకున్న సంఘటనకు సంబంధించి బాధితులకు సంతాపం తెలియచేసేందుకు పిట్స్బర్గ్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వేల మంది నిరసనకారులు రోడ్లపై గుమిగూడి ట్రంప్‌నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెన్సిల్వేనియా యూదు ప్రార్థనా మందిరం వద్దకు ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, ఆయన కుమార్తె, అల్లుడు కూడా వచ్చారు. యూదుడైన అమెరికా ఆర్థికమంత్రి స్టీవెన్ నుచిన్ కూడా ట్రంప్ కుటుంబంతో పాటు ఈ ప్రార్థనా మందిరానికి వచ్చారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించిన రెండువేల మందికిపైగా ప్రజల్లో యూదు వర్గానికి చెందిన వారు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. శ్వేతజాతి జాతీయతా వాదాన్ని విస్మరించే వరకు ట్రంప్‌ను ఈ నగరంలోకి స్వాగతించేదేలేదని పేర్కొంటూ పిట్స్బర్గ్కు చెందిన 70 వేల మంది యూదు ప్రజలు బహిరంగ లేఖ రాసి సంతకాలు చేశారు.













