నేడు డొనాల్డ్ ట్రంప్ డిశ్ఛార్జి ?
కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు డిశ్ఛార్జి అయ్యే అవకాశాలున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో ఇటీవలి కాలంలో రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్ అందించామని శ్వేతసౌధం వైద్యులు మీడియాకు తెలిపారు. శుక్రవారం ఒక దశలో ఆక్సిజన్ 94 శాతం కంటే దిగువకు పడిపోయిందని వివరించారు. ఇప్పుడు పరిస్థితి బాగుందని, జ్వరం ఏమాత్రం లేదని తెలిపారు. రెమిడెసివిర్ రెండో మోతాదు ఇచ్చిన తర్వాత కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు వెల్లడించారు. ట్రంప్ ఒక వీడియో విడుదల చేస్తూ రాబోయే కొద్దిరోజులు నిజంగా తనకు పరీక్షా కాలమని, ఏం జరుగుతుంతో చూద్దామని చెప్పారు. తాను ఆసుపత్రిలో చేరినప్పటి కంటే ఇప్పుడు బాగున్నానని చెప్పారు.
అధికారులు బయటకు చెప్పినదానికంటే ట్రంప్ పరిస్థితి మాత్రం సంక్లిష్టంగా ఉందని అంతకుముందు శ్వేతసౌధం సిబ్బంది అధిపతి మార్క్ మెడోస్ చెప్పారు. జ్వరం, ఆక్సిజన్ స్థాయిలపై తామెంతో ఆందోళన చెందామని, అనూహ్య రీతిలో ఆయన కోలుకున్నారని చెప్పారు. అమెరికా నుంచే కాదు యావత్ ప్రపంచం తరపున వైరస్‌తో పోరాడుతున్నా దానినుంచి బయటపడతాననే ఆశాభావంతో ఉన్నా. కచ్చితంగా వైరస్‌ను మట్టి కరిపిస్తాం. నేను తీసుకుంటున్న చికిత్సలు అద్భుతాలు. అందుకే నేను బాగున్నా అని ట్రంప్ తాజా వీడియోలో చెప్పారు.













