TANA: తానా 24వ మహాసభల్లో బండ్ల గణేష్ మాస్ స్పీచ్
డెట్రాయిట్ వేదికగా జరుగుతున్న తానా 24వ మహాసభల్లో (Tana 24th Conference) ప్రముఖ తెలుగు నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాలకు రాజకీయ నాయకులు, నవీన్ యెర్నేని వంటి అగ్రనిర్మాతలు వచ్చారని, భవిష్యత్తులో కచ్చితంగా హీరోహీరోయిన్లు అమెరికా తెలుగు కమ్యూనిటీ నుంచి వస్తారని గణేష్ జోస్యం చెప్పారు. యూఎస్‌లో ఉన్న చిన్నారులు అద్భుతంగా డ్యాన్సులు, యాక్టింగ్ చేస్తున్నాని మెచ్చుకున్నారు. అలాగే ఎన్నారై కమ్యూనిటీని కొనియాడిన ఆయన.. అగ్రరాజ్యంలో కష్టపడి సంపాదించి, స్వదేశంలో పెట్టుబడులు పెట్టడం వల్లనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ‘మీ తల్లిదండ్రులు ఎర్రబస్సులో అమెరికా పంపితే.. మీరు వాళ్లను ఎయిర్ బస్సులో తిప్పుతున్నారు’ అంటూ ఎన్నారైలను ఆయన (Bandla Ganesh) మెచ్చుకున్నారు. అమ్మను నమ్ముకున్న వాళ్లు, అమెరికాను నమ్ముకున్న వాళ్లు చెడిపోయినట్లు చరిత్రలో లేదని చమత్కరించారు. ఈ సందర్భంగా తానా కోసం పాటుపడిన అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎన్నారై కమ్యూనిటీ, తానా చేసిన సేవను గుర్తుచేసుకున్నారు.







