తెలుగు సభల నిర్వహణలో వచ్చే సమస్యలు
నేర్చుకోవలసింది నిర్వాహకులేనా? సభ్యులకు అవసరం లేదా?
తెలుగు టైమ్స్ 2003లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని తెలుగు మహాసభలకు నేను వెళ్ళాను. ఈ వేసవిలో అమెరికాలో తెలుగువారికి మూడు తెలుగు పండుగలు అని ఎంతో ఉత్సాహపడిన వాళ్ళలో నేనూ ఒకడిని. నాట్స్, నాటా, తానా వారు నిర్వహించిన మూడు తెలుగు మహాసభలకు హాజరయి పూర్తిగా చూసిన వాళ్ళలో నేనూ ఒకడినే. జాతీయ తెలుగు సంఘాలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక తెలుగు మహాసభ చేయడం దాదాపు 30 ఏళ్ళ నుంచి వస్తున్న ఆచారం. ప్రతి అధ్యక్షుడు పదవీ స్వీకారం చేయక మునుపే తాను చేయబోయే కాన్ఫరెన్స్ ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ కాన్ఫరెన్స్‌లకు అంత ప్రాముఖ్యత ఉంది.
– చెన్నూరి వెంకట సుబ్బారావు
అమెరికాలో పెరుగుతున్న భారతీయ సంతతి వలన ప్రతి రాష్ట్రం వారు జులైలో వచ్చే లాంగ్ వీకెండ్ (జూలై4)లో తమ కాన్ఫరెన్స్ ఉండాలనుకోవడం, కాన్ఫరెన్స్‌లకు వేదికలు అయిన కన్వెన్షన్ సెంటర్లలో ఈ ఏర్పాటు రాను రాను చాలా ఖర్చుతో కూడిన వ్యవహారమైపోయింది. మహాసభల నిర్వహణకు దాదాపుగా 2 మిలియన్ డాలర్ల నుంచి 4 లేదా 5 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అని తెలుస్తోంది.
అయితే 15 సంవత్సరాల క్రితం కాన్ఫరెన్స్‌లకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే పెద్దలు 15 నుంచి 20 మంది ఉంటే ఇప్పుడు కాన్ఫరెన్స్‌లకు ఆ స్థాయి లో విరాళాలు ఇచ్చే తెలుగువారు 100 – 150 దాకా ఉన్నారు అంటే అతిశయొక్తి లేదు. ఈ నేపథ్యంలో ప్రతి తెలుగు సంఘం నాయకులు కూడా తమ నాయకత్వ సమయంలో పెద్ద కాన్ఫరెన్స్ చేయాలి అనుకోవడం, ఆ లక్ష్యంతో ఒకవైపు విరాళాలు సేకరణ, ఇంకోవైపు ఏర్పాట్లు మొదలుపెడతారు. ఈ వేసవిలో మే 26నుంచి 28 వరకు న్యూజెర్సీలో నాట్స్ కాన్‌నరెన్స్, జూన్ 30 నుంచి 2 వరకు డల్లాస్‌లో నాటా కాన్ఫరెన్స్ జూలై 7 నుంచి 9వరకు ఫిలడెల్ఫియాలో తానా కాన్ఫరెన్స్ చాలా వైభవంగా ఒకదాని మించి ఇంకోకటి అన్నట్లుగా జరిగి, సంక్రాంతి బరిలో దిగిన 3 సినిమాలు హిట్ అయ్యాయన్న చందాన 3 కాన్ఫరెన్స్‌లు విజయవంతంగా ముగిసాయి. తెలుగు ప్రజలకు 3 తెలుగు పండుగలు బాగా జరిగినట్టే అయింది. తెలుగు కమ్యూనిటీ 3 చోట్ల వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఎంజాయ్ చేశారు. అయితే సభలు విజయవంతం అయినా, అందులో జరిగిన చిన్న – పెద్ద తప్పులు మాత్రం సోషల్ మీడియా ధర్మమా అని ప్రపంచం మొత్తం తెలిసాయి. ఏ ఇద్దరిని కలిసినా ‘ఆ కాన్ఫరెన్స్‌లో పుడ్ దొరకలేదట కదా’ అని, ‘ఆ కాన్ఫరెన్స్‌లో రెండు వర్గాలు బాగా కొట్టుకొన్నాయట కదా’ అని చర్చించుకోవడం వంటివి కొంచెం బాధగానే ఉంటుంది. ఆ లోటుపాట్లు గురించి మాట్లాడిన ప్రతివారు కూడా నిర్వాహకుల మీద నెపం వేయడం, కొందరు పెద్ద ఎత్తున దుమారం లేపటం చేస్తున్నారు.
తప్పు నిర్వాహకులదేనా? ఆ తప్పులు ఎందుకు లేదా ఎలా జరిగగాయో తెలుసుకుందామా??
మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు…. నిర్వాహకులు తమ 7వ మహాసభలు లేదా 23వ మహాసభలు అని చెప్పినా, కార్యక్రమాలు జరిగే నగరాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్తవారు నిర్వాహక కార్య వర్గం లో చేరుతారు ఆన్న విషయం అందరికి తెలిసిందే కదా! వారంతా తెలుగు భాష మీద, సంస్కృతి మీద ప్రేమతో, తెలుగువారికి ఇంకొక మంచి కార్యక్రమం అందించాలన్న తపనతో ముందుకు వచ్చిన వలంటీర్లే కదా… వారికి ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకోవటానికి ఆయా కమిటీలలో పని చేస్తారు. మనం అందరం వచ్చిన సెలబ్రిటీస్‌తో మాట్లాడుతూ ఫోటోలు తీసుకోంటూ హుషారుగా ఉన్న సమయాలు, ఆయా కమిటీల వారు ట్రాన్స్పోర్ట్ అని, హాస్పిటాలిటీ అని, రిజిస్ట్రేషన్ అని, బ్యాక్ స్టేజ్ అరేంజ్మెంట్ అని ఎంతో శ్రమపడుతూ ఉంటారు. ఇక ముందు కమిటీ సభ్యులు కూడా అంతకు ముందు వేరే నగరంలో కాన్ఫరెన్స్ చేసిన కార్యవర్గ సభులతో మాట్లాడి, మరింత పటిష్ఠమైన ప్రణాళిక లతో వస్తారని ఆశిద్దాం. రావాలని కోరుకుందాం.
అలాగే జరిగిన జరుగుతున్న తప్పులను కొద్దిగా విశ్లేషణ చేద్దాం. తెలుగు సంఘం అధ్యక్షులు, ఇతర నాయకులు ప్రతి నగరం తిరిగి అందరి మద్దతు కోరటం, అన్ని నగరాలను కొందరు తమ తమ విరాళాలు ప్రకటించడం జరుగుతుంది. వచ్చిన విరాళాల సంఖ్యను బట్టి, ఖర్చులు నిర్ణయించు కొంటారు. ఏర్పాట్లు మొదలు పెడతారు. అయితే అందరు ప్రకటించిన వెంటనే విరాళాలు ఇవ్వరు. కాన్ఫరెన్స్ దగ్గర పడుతున్న కొద్ది ఆ విరాళాలు వసూలు అవుతూ ఉంటాయి. అలాగే మొన్న జరిగిన తానా మహాసభలు 7 జూలైన ప్రారంభమవుతాయని ముందే తెలిసినా చాలామంది జూలై 5 – 6 తేదీలలో కూడా చెక్‌లు ఇచ్చారు. వీరి సంఖ్య దాదాపు 100 మంది దాకా వుండటంతో, డోనర్లకు ఇవ్వాల్సిన సౌకర్యాలు వారికి అప్పటికప్పుడు కల్పించాలంటే కస్ట సాధ్యమైన పని అవటం వలన ఆ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి. నిర్వాహకులు – కమిటీ సభ్యులు ఎలాగో వచ్చినవారందరికీ అవసరమైన వసతి ఇతర సౌకర్యాలు కల్పించే పని లో సతమతమయ్యారు. ఈ ప్రక్రియ కారణంగా ఏర్పడిన గందరగోళ పరిస్థితుల్లో ముందుగా విరాళాలు ఇచ్చిన దాతలు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారికి వసతి ఇతర సౌకర్యాల కల్పనలో కొంచెం జాప్యం జరిగింది.
ఇంకా చెప్పాలంటే, ఒక నాయకుడు వారి నగరం నుంచి దాదాపు 20 మంది దాతలతో వారి వారి విరాళాల చెక్కులతో జూలై 7వ తేదీ మధ్యాహ్న కాన్ఫరెన్స్ నిర్వాహకుల వద్దకు వచ్చి మాకు రూమ్స్ ఎక్కడ? అని అడిగిన సంఘటన కూడా జరిగింది. మంచి కార్యక్రమానికి విరాళాలు ఇస్తామని ముందుకు రావడం హర్షణీయం. అభినందనీయం. కాని వారు కనీసం కాన్ఫరెన్స్‌కు వారంరోజులు ముందు అయినా వారి విరాళాలు ఇస్తే…. దాతలు- వారి వారి రూమ్స్, బ్యాడ్జీలు అన్ని సిద్దం చేసి ఉంచుతారు కదా? అలాగే ఆ నగర నాయకుడు ఎంతో సమర్ధవంతంగా తమ నగరంలో అందరిని కలిసి, కాన్ఫరెన్స్‌కు ముందుగానే విరాళలు స్వీకరించారు. సంతోషం. కాని వాటిని రిజిస్ట్రేషన్ కమిటీ ముందుగా తెలిపితే ఎంతో బావుండేది కదా? ఇలాంటి పరిస్థితులలో నేర్చుకోవలసిన పాఠాలు కమిటీ సభ్యులే కాదు…సోదర నాయకుడు, ఇతర సభ్యులు కూడా నేర్చుకోవలసి ఉంది.
ఏ తెలుగు సభలు అయినా విజయవంతం కావాలంటే ముఖ్యమైనది అందరికి కమ్మని భోజనం పెట్టడమే అని మనందరికీ తెలుసు. నిర్వాహకులు వచ్చే వారి సంఖ్యను బట్టి 5000 లేదా 10000 భోజనాలు రెండు రోజులకు తయారు చేయాలి’ అని సిద్ధం అవుతారు. 5000 -10000 మందికి 5 భోజనాలు అంటే దాదాపుగా రెండు రోజులలో 30000 పైన భోజనాలు తయారు చేయ్యాలి. వడ్డించాలి. ఇది నిజంగా యజ్ఞమే. కాన్ఫరెన్స్‌కి ముఖ్యమైనది ఎంతో కష్టతరమైనదని కూడా ఇదే. ఇక్కడ కూడా ఇందాక పైన చెప్పినట్లుగా ఆ రోజుకు, ఆ రోజులకు అని కాకుండా కాన్ఫరెన్స్‌కు రావాలనుకునేవారు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకుని అప్పుడే టిక్కెట్ కొనుక్కొంటే సగం సమస్య పరిష్కారమైపోతుంది. కాన్ఫరెన్స్ రోజు మధాహ్నం 7000 మందికి సరిపడా వంటకాలను సిద్ధం చేసి ఉన్న సమయంలో అనుకోకుండా 8000 లేదా 10000 వస్తే ఆ 1000 – 2000 మందికి సరిపడే తగినన్ని కూరలు ఎక్కడి నుంచి వస్తాయి? 10000 వచ్చారని తెలిసినా సాయత్రం భోజనం తయారు చెయ్యటానికి ఎంత ఇబ్బంది. అని ఆలోచించమని అందరిని కోరుతున్నాను. ఇకపోతే ఫుడ్‌లో షార్టేజ్ ఉంది. ఐటెమ్స్ అయిపోతున్నాయట. అన్న వార్త వినంగానే ఆత్రుతలో, అదుర్దాలో కొందరు చేసే హడావుడి మన అందరికి ఇబ్బందిని కలిగిస్తుంది. అలాంటి సమయంలో ఆ హడావుడి పడుతున్న సభ్యులను శాంతపరచడం సర్దుబాట్లు వంటివి చేయడం వల్ల చాలా వరకు సాఫీగా సాగిపోతుంది.
ఇదే సమయంలో ఇంకో విషయం మీ ముందు పెడుతున్నాను. మనం అందరం ఒక సాధారణ హోటల్‌గా పేరు ఉన్న మెక్ డొనాల్డ్‌కి వెళ్ళినా, మన ఫుడ్ ట్రే తెచ్చుకొని, తిన్న తరువాత మిగిలిపోయినవి ట్రాష్ బాక్స్‌లో పడేసి, ఫుడ్ ట్రేని స్టాండులో పెట్టి, పేపర్ నాప్ కిన్ తో టేబుల్ ను తుడిచేసి వెళుతాము. దాదాపు 100 కు 100 మంది ఇదే చేస్తారు. కాని ఫలానా రూమ్‌లో బ్రేక్ ఫాస్ట్ ఉంది అని చెప్పగానే వెళితే …. టేబుల్ మీద వదిలేసిన ప్లేట్లు, సగం తాగిన కాఫీ కప్పులు, టేబుల్ మీద, నెల మీద పడిపోయి ఉన్న ఫుడ్ లేదా కాఫీ పరిస్థితిని చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఫుడ్ కింద పడటం లేదా కాఫీ వలకడం పెద్ద తప్పు కాదు. కానీ ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాల్సిన బాధ్యత ఆ ఫుడ్ పడివేసిన వారిదే అని అందరికీ తెలుసు.. తెలిసినా శుభ్రపరచకుండా అక్కడే వదిలేసి వెళ్ళిన అతిధిది తప్పు కదా?
పేరెంట్స్ చెబితే పిల్లలే వినని రోజులు ఇవి. ఇంక ఆఫీసులో, ఫంక్షన్లలో వాళ్ళకు చెబితే వింటారని గ్యారంటీ లేని రోజులు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినీ కంట్రోల్ చేయలేము. కేవలం సెల్ఫ్ డిసిప్లెయిన్ ఒకటే అందరూ అలవరచుకోవాలి. దాదాపు ఒక కాన్ఫరెన్స్ని విజయవంతం చేయటానికి 15 నెలల కష్టపడిన పెద్ద నాయకులు (అధ్యక్షులు, కన్వీనర్ లాంటి వారు) 15 వారాలు శ్రమపడిన ముఖ్య నాయకులు (వివిధ కమిటీ చైర్ పర్సన్లు) 15 రోజులు శ్రమపడుతున్న ఆయా కమిటీ సభ్యులకు వచ్చినవారంతా సహకరిస్తే ముందుముందు జరిగే మహాసభలు, ఇతర వేడుకలు లోటుపాట్లు లేకుండా విజయవంతంగా జరుగుతాయని ఆశించవచ్చు. పెరుగుతున్న తెలుగు కమ్యూనిటికి, పెరుగుతున్న సంఘాలు, వాటి కార్యక్రమాలు మనుముందు కూడా అందరికి ఆనందం కలిగించేలా ఆహ్లాదపరిచేటలా ఉండాలంటే మనం అందరం స్వీయ విశ్లేషణ (సెల్ఫ్ అనాలసిస్) చేసుకుని, స్వీయ క్రమశిక్షణ (సెల్ఫ్ డిసిప్లెయిన్) అలవరుచుకుంటే, ఎందరో ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహి స్తారని, అందరికీ అనేక తెలుగు పండుగలు వస్తాయని మనవి.













