కరోనాపై అమెరికా టీకా రెడీ?
కరోనా కట్టడికి అమెరికాలో పిట్స్బర్గ్ కరోనావైరస్ టీకా (పిట్స్కో వాక్స్)ను రూపొందించారు. దీనిని ముందుగా ఎలుకలలో ప్రయోగించి చూశారు. ఆ తరువాత ఎలుకలలో రోగనిరోధక శక్తి ఇనుమడించినట్లు వెల్లడైంది. కరోనా వైరస్‌ను నియంత్రించే విధంగా శరీరంలో నిరోధక శక్తి ఉండటం కీలకం. ఈ దిశలో పిట్స్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇబయోమెడిసిన్ జర్నల్‌లో తాజాగా ప్రచురించారు. కరోనా వైరస్‌ను నియంత్రించే పలు యాంటిబాడీస్ సముదాయాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ వ్యాక్సిన్‌ను రూపొందించి, అత్యంత సూక్ష్య స్థాయి పక్రియతో ఎలుకలలో ప్రవేశపెట్టారు. రెండు వారాల వ్యవధిలోనే యాంటీబాడీస్ సమర్థవంతంగా పనిచేసినట్లు నిర్థారించారు. ఇంతకు ముందటి సార్ప్ వైరస్ దశలో తలెత్తిన పరిణామాలను, వైరస్ సంక్రమణం, చికిత్సలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు పిట్స్కో వ్యాక్స్‌ను రూపొందించినట్లు జర్నల్ తెలిపారు.
2003, 2014లో తలెత్తిన వైరస్‌లకు ఇప్పటి కరోనా వైరస్‌కు ఉన్న సారూప్యతను పోల్చుకుని తాము సరైన టీకాను రూపొదించినట్లు తెలిపారు. ఇప్పటి వైరస్‌ను తట్టుకునే రోగనిరోధక శక్తిని స్పైక్ ప్రొటిన్ కలుగచేస్తుంది. ఈ ప్రొటిన్‌ను రూపొందించడం, దీని సామర్థ్యతను ఎలుకలలో చేపట్టిన ప్రయోగాల ద్వారా నిర్థారించడం జరిగిందని పరిశోధకులు తెలిపారు. వైరస్ మూలం తెలుసుకునే తాము ఈ టీకాను కనుగొన్నట్లు వెల్లడించారు.













